ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ కు మళ్లీ తలనొప్పి మొదలైంది. మొన్నటి వరకూ నెలా, రెండు నెలలు ఇబ్బందిపడి ఉద్యోగుల పీఆర్సీ అంశాన్ని ఓ కొలిక్కి తెస్తే.. ఇప్పుడు అది కాస్తా మళ్లీ మొదటికి వచ్చినట్టు కనిపిస్తోంది. కీలకమైన ఉద్యోగ సంఘాలు పీఆర్సీకి అంగీకరించి.. జగన్‌తో చర్చలు జరిపి.. ప్రభుత్వ ప్రతిపాదనలకు ఓకే చెప్పేశారు. ఆ తరవాత ప్రభుత్వ నిర్ణయాలు మాకు ఓకే అని చెప్పి మీడియా ముందు కూడా ఆనందం వెలిబుచ్చారు.


అయితే.. కొన్ని సంఘాలు మాత్రం ఈ పీఆర్సీని ఒప్పుకునేది లేదని మళ్లీ మొండి కేస్తున్నాయి. ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ ఆమోదయోగ్యం కాదంటూ ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం సీఎస్ కు లేఖ రాసింది. సచివాలయంలో సీఎస్ ను కలిసి విజ్ఞాపన పత్రాన్ని అందించిన ఏపీజీఈఏ అధ్యక్షుడు సూర్యనారాయణ, కార్యదర్శి ఆస్కార్ రావు... పలు దఫాలుగా ఉద్యోగ సంఘాలతో చర్చించినప్పటికీ ఉద్యోగులకు మేలు జరిగేలా నిర్ణయాలు రాలేదని అంటున్నారు.


అశుతోష్ మిశ్రా కమిషన్ ఇచ్చిన నివేదికను ఉద్యోగ సంఘాలకు ఇచ్చి ఉండాల్సిందని ఏపీజీఈఏ అంటోంది. 2010లోనే అప్పటి పీఆర్సీ  సిఫార్సుల మేరకు 39 శాతం ఫిట్మెంట్ ఇచ్చారని ప్రస్తుతం 30 శాతమైనా ప్రకటించి ఉండాల్సిందని ఏపీజీఈఏ స్పష్టం  చేసింది. గత ప్రభుత్వం కూడా ఉద్యోగులను దృష్టిలో ఉంచుకుని 43 శాతం ఫిట్మెంట్ ఇచ్చిందని పొరుగు రాష్ట్రంలోనూ 30 శాతంగా పీఆర్సీ ఉందని ఉద్యోగుల సంఘం  ఏపీజీఈఏ అంటోంది.


వేతన సవరణ సంఘం సిఫార్సు చేసినట్టుగా ఇంటి అద్దెభత్యం, సీసీఏలు యథాతథంగా కొనసాగాలని కూడా ఏపీజీఈఏ విజ్ఞప్తి చేస్తోంది. హైదరాబాద్ నుంచి తరలి వచ్చిన ఉద్యోగులకు ఇచ్చే భత్యాలు కొనసాగించాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కోరుతోంది. 70-79 ఏళ్ల మధ్య ఉన్న పెన్షనర్లకు అదనంగా 10 శాతం పెన్షన్ ఇవ్వాలని ఏపీ జీఈఏ డిమాండ్ చేస్తోంది. పెండింగ్ లో ఉన్న 5 డీఏలను తక్షణం చెల్లించాలని ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె.సూర్యనారాయణ డిమాండ్ చేస్తున్నారు. అంతే కాదు.. తక్షణం సీపీఎస్ ను రద్దు చేయాలని.. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు తక్షణం ప్రోబేషన్ డిక్లేర్ చేయాలని సీఎస్ కు రాసిన లేఖలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కోరింది.

మరింత సమాచారం తెలుసుకోండి: