ఆయ‌న వెనుక బీజేపీ అధినాయ‌క‌త్వ‌మే ఉందో, లేక జ‌న‌సేన మ‌ద్ద‌తుగా నిలుస్తుంద‌న్న న‌మ్మ‌క‌మో తెలియ‌దుగానీ న‌ర‌సాపురం ఎంపీ ర‌ఘురామ‌రాజు వైసీపీ  అధినాయ‌క‌త్వానికి ఎదురొడ్డి నిలిచేందుకు సై అంటున్నారు. అవును.. ఆయ‌న ఏకంగా ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డినే టార్గెట్ చేసి స‌వాల్ చేస్తున్నారు. ఎంపీ ప‌ద‌వికి రాజీనామా చేసి అదే స్థానం నుంచి పోటీ చేసి మ‌ళ్లీ గెలుస్తాన‌ని ప్ర‌క‌టించిన వైసీపీ రెబెల్ ఎంపీ ర‌ఘురామ‌రాజుకు ఏపీ సీఐడీ అధికారులు బుధ‌వారం పాత కేసులో నోటీసులు జారీ చేసిన విష‌యం తెలిసిందే. ఇదే అంశంపై మీడియాతో మాట్లాడిన ఎంపీ ఈ నెల 13 లేదా 17న మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని ఏపీ సీఐడీ పోలీసులు త‌న‌కు తెలిపార‌ని, ఎనిమిది నెల‌ల త‌రువాత మ‌ళ్లీ వ‌చ్చి నోటీసులు ఇవ్వ‌డం, అదీ పండుగ స‌మ‌యం చూసుకుని విచార‌ణ పేరుతో పిల‌వ‌డం త‌న‌ను ఇబ్బంది పెట్టాల‌నే వారి వైఖ‌రిని స్ప‌ష్టం చేస్తోంద‌ని అన్నారు. గ‌తంలో త‌న‌ను ఈవిధంగానే వ‌చ్చి అరెస్టు చేసి తీసుకెళ్లి..  సీఎం జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు చేయాలంటూ తాను వేసిన‌ పిటిష‌న్‌ను ఉప‌సంహ‌రించుకోవాలంటూ త‌న‌ను కొట్టార‌ని ఇది ఉన్మాద చ‌ర్య కాదా అంటూ ఆయ‌న ప్ర‌శ్నించారు.

దాడిపై ప్ర‌శ్నిస్తే త‌న‌పై సొంత మీడియాలో దుష్ప్ర‌చారం సాగించారని, ప్ర‌శ్నించే హ‌క్కును సైతం హ‌రించాల‌నుకోవ‌డం అదీ ఓ ఎంపీని కూడా విడ‌వ‌క‌పోవ‌డం ఏ ర‌క‌మైన ప్ర‌జాస్వామ్య‌మో అర్థం చేసుకోవాల‌న్నారు. చేత‌నైతే త‌న‌పై అనర్హ‌త వేటు వేయాల‌ని వ‌చ్చే నెల 5వ‌ర‌కు స‌మ‌య‌మిస్తున్నాన‌ని మ‌రోసారి వైసీపీ ప్ర‌భుత్వానికి స‌వాల్ విసిరారు. త‌న‌కు ప్ర‌జ‌ల ఆశీర్వాదం ఉంద‌ని, పార్టీల‌కు అతీతంగా అంద‌రి మ‌ద్ద‌తు ఉంటుంద‌న్న న‌మ్మ‌కం ఉంద‌ని ర‌ఘురామ‌రాజు అన్నారు. దీంతో ఏపీ ప్ర‌భుత్వంపై పోరాటంలో ఎంపీ రఘురామ‌రాజు ఎక్క‌డా వెన‌క్కుత‌గ్గబోవ‌డం లేద‌ని స్ప‌ష్టంగా తేలిన‌ట్టే. కాగా ఆయ‌న త్వ‌ర‌లో ఎంపీ ప‌ద‌వికి రాజీనామా చేసి బీజేపీలో చేరి ఆ పార్టీ త‌ర‌పున పోటీ చేస్తార‌ని ఇప్ప‌టిదాకా వార్త‌లు రాగా, జ‌న‌సేన‌లో చేరి ఆ పార్టీ నుంచి పోటీ చేసే అవ‌కాశాన్ని సైతం కొట్టి పారేయ‌లేమ‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో విశ్లేష‌ణ‌లు వ‌స్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

RRR