ఏపీలో చిత్ర ప‌రిశ్ర‌మ వ‌ర్గాలకు ప్రభుత్వానికి రోజురోజుకి వివాదం ముదురుతుండ‌టంతో మంత్రులు, ఎమ్మెల్యేలు- సినీ ప‌రిశ్ర‌మ ముఖ్యుల మ‌ధ్య మాట‌ల తూటాలు పేలుతున్నాయి. ఇప్ప‌టిదాకా ప్ర‌భుత్వం ఏం చేసినా త‌మ ఇబ్బందులు విన్న‌విస్తూ సంయ‌మ‌నం పాటించిన సినీ ప‌రిశ్ర‌మ పెద్ద‌లు ఇక ప్ర‌భుత్వంతో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధ‌మైన‌ట్టుగా వారి వ్యాఖ్య‌లు స్ప‌ష్టం చేశాయి. త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ‌, ఎన్వీ ప్ర‌సాద్‌, వీఎన్ ఆదిత్య వంటివారు చిత్ర ప‌రిశ్ర‌మకు చెందిన‌వారిని కించ‌పరిస్తే ఊరుకునేది లేద‌ని వైసీపీ ఎమ్మెల్యే న‌ల్ల‌పురెడ్డి ప్ర‌స‌న్న‌కుమార్‌రెడ్డికి ప్ర‌త్య‌క్షంగా, ప్ర‌భుత్వానికి ప‌రోక్షంగా ఘాటుగా కౌంట‌ర్ ఇచ్చారు. ఇదిలా ఉండ‌గా ఏపీలో త‌లెత్తిన స‌మ‌స్య ప్ర‌తిష్టంభ‌న‌పై తాను అక్క‌డి ప్ర‌భుత్వ పెద్ద‌ల‌తో మాట్లాడ‌తాన‌ని తెలంగాణ మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్‌యాదవ్ ప్ర‌క‌టించ‌డం ఆస‌క్తిని క‌లిగిస్తోంది. ఏపీ ప్ర‌భుత్వానికి భిన్నంగా తెలంగాణ ప్ర‌భుత్వం సినీ ప‌రిశ్ర‌మ‌కు అనుకూలంగా నిర్ణ‌యాలు తీసుకుంటున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే ప‌రిశ్ర‌మ పెద్ద‌లు ఏపీ ప్ర‌భుత్వంతో నెల‌కొన్న స‌మ‌స్య‌ను ప‌రిష్కారానికి స‌హ‌క‌రించాల్సిందిగా తెలంగాణ ప్ర‌భుత్వ పెద్ద‌ల‌ను కోరిన‌ట్టు తెలుస్తోంది.
 
ఇక సినిమా పరిశ్ర‌మ ముఖ్యులు ఎదురు దాడి చేస్తూ వ‌రుస‌గా విరుచుకు ప‌డ‌టంతో ఏపీ ప్ర‌భుత్వంలోనూ క‌దలిక వ‌చ్చిన‌ట్టే క‌నిపిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి గురువారం భేటీ కానుండ‌టం దీనినే సూచిస్తోంద‌ని తెలుస్తోంది. ప‌రిశ్ర‌మ‌లో మెగాస్టార్‌గా ఉన్నా సౌమ్యుడిగా పేరున్న చిరంజీవి ప్ర‌భుత్వంతో స‌మ‌స్య‌ను సామ‌ర‌స్యంగా  ప‌రిష్క‌రించేందుకే మొద‌టినుంచీ కృషి చేస్తున్నాఇప్ప‌టిదాకా పెద్ద‌గా ఫ‌లితం క‌నిపించ‌లేదు. అయితే తెలంగాణ ప్ర‌భుత్వం కూడా క‌ల‌గ‌జేసుకోవ‌డం తోనే మ‌రోసారి వీరిద్ద‌రి భేటీ జ‌ర‌గ‌బోతోంద‌ని ఏపీ ప్ర‌భుత్వం నుంచి ఈసారి కొన్ని సానుకూల నిర్ణ‌యాలు ఉండ‌వ‌చ్చ‌ని ప‌రిశ్ర‌మ వ‌ర్గాలు చెపుతున్నాయి. ఇక చిత్ర ప‌రిశ్ర‌మకు హైద‌రాబాద్ కేంద్రంగా అభివృద్ది చెందిన విష‌యం తెలిసిందే. ఆ న‌గ‌రం అభివృద్దిలో సినీ ప‌రిశ్ర‌మ పాత్రేమీ త‌క్కువ కాదు. అక్క‌డ వేల‌మందికి  అది ఉపాధి క‌ల్పిస్తోంది. ఈ నేప‌థ్యంలోనే అక్క‌డి ప్ర‌భుత్వం ఈ అంశంలో క‌ల‌గ‌జేసుకుంద‌న్న వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈవార్త‌ల్లో ఎంత‌వ‌ర‌కు నిజ‌ముందో చిరంజీవి, ఏపీ ముఖ్య‌మంత్రి భేటీ త‌రువాత  స్ప‌ష్టంగా తేల‌నుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: