రాష్ట్రమంతటా సంక్రాంతి సందడి నెలకొంటే.. గుంటూరు జిల్లాలో మాత్రం రాజకీయ కక్షలు పురివిప్పుకున్నాయి. గుంటూరు జిల్లాలో టీడీపీ నేతను హత్య చేశారు. మాచర్ల టీడీపీ ఇన్‌ఛార్జి జూలకంటి బ్రహ్మారెడ్డి అనుచరుడు చంద్రయ్య ను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా చంపేశారు.
టీడీపీ నాయకుడు చంద్రయ్యను కర్రలు, రాళ్లతో దుండగులు కొట్టి చంపేసారు. ఈ ఘటనతో గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడులో ఉద్రిక్తత నెలకొంది.


చంద్రయ్య హత్యకు పోలీసుల నిర్లక్ష్యమే కారణమంటూ అతని కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తున్నారు. చంద్రయ్య మృతదేహాన్ని తరలించేందుకు పోలీసులు చేస్తున్న యత్నాన్ని అడ్డుకున్నారు. పోలీసులు ఆలస్యంగా వచ్చారంటూ చంద్రయ్య కుటుంబసభ్యుల ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతదేహం పోస్టుమార్టం కోసం తరలించేందుకు పోలీసులు ప్రయత్నించగా చంద్రయ్య కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు.


తమ నాయకుడు బ్రహ్మారెడ్డి వచ్చేవరకు మృతదేహం కదల్చొద్దని కుటుంబసభ్యుల పట్టుబట్టారు. ఈ హత్యను టీడీపీ తీవ్రంగా ఖండించింది. టీడీపీ అధినేత చంద్రబాబు ఈ మధ్యాహ్నం గుండ్లపాడు వెళ్లనున్నారు. గుండ్లపాడులో చంద్రయ్య మృతదేహానికి నివాళులర్పించి ఆయన కుటుంబసభ్యులను పరామర్శించనున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరవాత ఇలాంటి కక్ష రాజకీయాలు బాగా పెరిగిపోయాయని టీడీపీ నేతలు మండిపడుతున్నారు.


వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే.. ఇలాంటి రాజకీయ హత్యలు కొన్నాళ్లు బాగా జరిగాయి. అప్పట్లో చంద్రబాబు.. ఈ రాజకీయ హత్యలపై ఉద్యమమే చేశారు. బాధితుల కుటుంబాలతో ధర్నాలు చేయించారు. ఇటీవలి కాలంలో ఇలాంటి రాజకీయ హత్యలు కాస్త తగ్గుముఖం పట్టాయి. కానీ.. ఇప్పుడు గుంటూరు జిల్లాలో జరిగిన ఈ రాజకీయ హత్యతో మరోసారి పార్టీల మధ్య వైషమ్యాలు పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇలాంటి రాజకీయ హత్యలను ప్రోత్సహించడం ఏమాత్రం మంచిది కాదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా.. తమదే అధికారం శాశ్వతమని ఇలాంటి హత్యలను ప్రోత్సహించడం పరిపాటి అయ్యింది. మరి ఈ ఘటనపై వైసీపీ ఎలా స్పందిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: