రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సంక్రాంతి సంద‌ళ్లు మొద‌ల‌యినా కానీ తాగుబోతుల వీరంగం మాత్రం నియంత్ర‌ణ‌లో లేదు. కోడి పందాలు జ‌రిగే చోట మ‌ద్యం విక్ర‌యాల‌కు అంతూ పొంతూ అన్నదే లేదు. ఆదాయాల‌ను దండీగా దండుకునే ప్ర‌భుత్వాల‌కు
ఈ పాటి శ్ర‌ద్ధ ఎందుకు ఉంటుంద‌ని? అందుకే ప‌ల్లె త‌ల్లి త‌ల్ల‌డిల్లుతోంది. బిడ్డ‌ల బాధ్య‌తారాహిత్యం చూసి గుండె బ‌రువెక్కి వేద‌న చెందుతోంది.. పండ‌గ నిర్వ‌చ‌నాలు మార్చి తాగి తంద‌నాలు ఆడేస్తున్న మ‌గానుభావులారా ఇక‌నైనా మారండ్రా!
రంగులు దిద్దే వేళ
రంగులేంటో తేలిపోనున్నాయి
తాగుబోతుల చిందుల వేళ
మ‌న ప‌ల్లె త‌ల్లి క‌న్నీరెడుతోంది
అయినా కూడా మ‌న‌కు హ్యాపీ సంక్రాంతి నే!

ప్ర‌త్యేక‌మ‌యిన సంద‌ర్భాల్లో మ‌నుషులు ప్ర‌త్యేకంగా ఉండ‌డం చాలా అరుదు..అవును అల‌వాట్ల‌కు దూరంగా ఉండ‌డం ప్ర‌త్యేకం.. తాగ‌డం వాగ‌డం కాకుండా వీటికి దూరంగా ఉండడం ప్ర‌త్యేకం.. వీటితో పాటు వ్య‌స‌నాల‌కు దూరంగా, పిల్లా పాప‌ల‌తో పండుగ చేసుకోవ‌డం అన్న‌దే ఈ సంక్రాంతికి ప్ర‌త్యేకం. కానీ ఇవ‌న్నీ ఇప్పుడు జ‌రుగుతాయ‌ని జ‌ర‌గ‌బోతాయ‌ని ఊహించ‌డం క‌ష్టం..

 
పండుగంటే ఇంటిల్ల‌పాదీ ఆనందించ‌డం..ఆనందంగా ఉండేందుకు దారులు వెత‌క‌డం.కానీ పండుగ అంటే అర్థాలే
మారిపోతున్నాయి.అష్టాచెమ్మ‌లు పోయి చెప్పాపెట్ట‌కుండా ఆన్లైన్ లూడో గేములు వ‌చ్చి ప‌డ్డాయి.మ‌న దేశంలో ఒక‌ప్ప‌టి సంస్కృతి పోయి డిజిట‌ల్ ఆట‌లు అన్నీ పిల్ల‌ల‌నూ పెద్ద‌ల‌ను ఆడిస్తున్నాయి.. ఇవే కాకుండా కొత్త కొత్త అల‌వాట్లు వ్య‌స‌నాలు జీవితాల‌ను ఛిద్రం చేస్తున్నాయి.

సంక్రాంతి పండుగ సంద‌ర్భంగా ఎక్క‌డిక్క‌డ తాగుబోతుల  రాజ్యం న‌డుస్తోంది.రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ నాటు సారా అమ్మ‌కాలు జోరందుకుంటున్నాయి.పేరొందిన కంపెనీల మద్యాన్ని అందుబాటులోకి తేవ‌డంలో ఏపీ స‌ర్కారు మొద‌ట్నంచి పెద్ద‌గా ఆస‌క్తి చూప‌క‌పోవ‌డం,ర‌క‌ర‌కాల పేర్ల‌తో మందు విక్ర‌యాలుచేప‌ట్టి డ‌బ్బులు గుంజుకోవ‌డంతో ఈ సారి మందుబాబులు నాటు పైనే ప్రేమ పెంచుకుంటున్నారు.ముఖ్యంగా ఒడిశా నుంచి అడ్డ‌దారుల్లో శ్రీ‌కాకుళం మొద‌లుకుని తెలంగాణ వ‌ర‌కూ మ‌ద్యం త‌ర‌లిపోతోంది.అయినా వీటిని నియంత్రించ‌డంలో స్పెష‌ల్ ఎన్ ఫోర్స్‌మెంట్ బ్యూరో స‌భ్యులు విఫ‌లం అవుతున్నారు.ఇక తెలంగాణ‌లోనూ ఇదే విధంగా మ‌ద్యం అక్ర‌మ ర‌వాణాపై అస్స‌లు నిఘా లేదు. స‌రిహ‌ద్దు పోలీసులు ప‌ర‌స్పర అవ‌గాహ‌న‌తో ప‌నిచేయాల్సి ఉన్నా వారంతా మొద్దు నిద్ర న‌టిస్తున్నార‌న్న ఆరోప‌ణ ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: