ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పిల్లల్లో కరోనా కేసులు నిర్ధారణ అవుతున్నట్టు వైద్యులు తెలిపారు. కడుపునొప్పి, వాంతులు లాంటి లక్షణాలు ఉన్న కొందరు చిన్నారులను టెస్ట్ చేయగా పాజిటివ్ వచ్చినట్టు పేర్కొన్నారు. ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో ఐదుగురు చిన్నారులు చికిత్స పొందుతుండగా.. ఇద్దరికి ఆక్సిజన్ చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు. పిల్లల్లో 101-102 డిగ్రీల జ్వరం, విరేచనాలు లాంటి లక్షణాలు ఉంటే టెస్టు చేయించాలని సూచిస్తున్నారు.

ఇక తెలంగాణ రాష్ట్రంలో కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోందని హెల్త్ డైరెక్టర్ జి.శ్రీనివాసరావు తెలిపారు. ప్రజలు కోవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తూ పోతే.,. ఈ నెల చివరి నాటికి రాష్ట్రంలో రోజుకూ 50వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతాయని హెచ్చరించారు. ప్రజలు నిబంధనలు పాటించాలని.. ఎట్టి పరిస్థితుల్లోనూ గుంపుల్లోకి వెళ్లకూడదని సూచించారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో 18వేలకు పైగా యాక్టివ్ కేసులున్నట్టు పేర్కొన్నారు.

మరోవైపు కరోనా రోగుల కాంటాక్టులకు వారం రోజులే క్వారంటైన్ ఉంటుందని కేంద్రం తెలిపింది. అలాగే స్వల్ప లక్షణాలు ఉన్న కరోనా బాధితులు సైతం ఏడు రోజుల్లోనే డిశ్చార్జ్ కావొచ్చని పేర్కొంది. అయితే దేశంలో ఇప్పటి వరకు ఒమిక్రాన్ వల్ల ఒక్కరు ప్రాణాలు కోల్పోయినట్టు తెలిపింది. ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తున్నట్టు వెల్లడించింది. బెంగాల్ లో 32శాతం, ఢిల్లీలో 23శాతం, మహారాష్ట్రలో 22శాతం పాజిటివిటీ రేటు అధికంగా ఉందని వివరించింది.

ఇక మన దేశంలో గత 24గంటల్లో కొత్తగా 2లక్షల 47వేల 417కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పేలిస్తే 27శాతం అధికంగా వెలుగు చూశాయి. బుధవారం 84వేల 825మంది బాధితులు కోవిడ్ నుంచి కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం 11లక్షల 17వేల 531 యాక్టివ్ కేసులున్నాయి. రోజువారి పాజిటివిటీ రేటు 13.11శాతానికి పెరిగింది. అటు దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 5వేల 488కి పెరిగింది. కరోనా విజృంభిస్తున్న వేళ.. ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: