ఏదైనా అపార్ట్ మెంట్ లో మూడు కంటే ఎక్కువ కరోనా కేసులు నమోదైతే ఆ అపార్ట్ మెంట్ కాంప్లెక్స్ ను వారం రోజుల పాటు కంటైన్ మెంట్ జోన్ గా  ప్రకటిస్తామని బృహత్ బెంగళూరు మహానగర పాలిక తెలిపింది. ఆ కంటైన్ మెంట్ జోన్ లోని నివాసితులందరికీ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపింది. హోమ్ క్వారంటైన్ లో ఉండాల్సిన వారు బయట తిరగకుండా చూడాల్సిన బాధ్యత సంబంధిత వెల్ఫేర్ అసోషియేషన్ దేనని స్పష్టం చేసింది.

ఇక దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న క్రమంలో అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని నరేంద్రమోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. దేశంలో నెలకొన్న పరిస్థితుల గురించి వారితో చర్చించారు. వైరస్ కట్టడికి రాష్ట్రాలు విధిస్తున్న ఆంక్షలు, వ్యాక్సినేషన్ గురించి సమీక్షించారు. ఈ కార్యక్రమానికి హోంమంత్రి అమిత్ షా కూడా హాజరయ్యారు. ఇదిలా ఉంటే.. దేశంలో ఈ రోజు దాదాపు 2.50లక్షల కరోనా కేసులు వెలుగు చూశాయి. మహమ్మారిపై అందరం కలిసికట్టుగా పోరాడదామనీ.. ఎవరూ ధైర్యం కోల్పోవద్దన్నారు ప్రధాని మోడి. ఈ సమావేశంలో రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్ సుఖ్ మాండవీయ కూడా పాల్గొన్నారు.

ఇక తెలంగాణ రాష్ట్రంలో సైతం కరోనా ఉధృతి పెరుగుతోంది. గడిచిన 24గంటల్లో 2వేల 707 కేసులు నమోదయ్యాయి. ఇద్దరు మృతి చెందారు. ఇప్పటి వరకూ 7లక్షల 2వేల 801 కేసులు నమోదయ్యాయి. మొత్తం 4వేల 49మంది మరణించారు. అయితే నిన్నటితో  పోలిస్తే ఈ రోజు కేసులు పెరిగాయి.  

అటు ఏపీలో సైతం కరోనా ఆందోళనకర స్థాయికి చేరుకుంటోంది. గడిచిన 24గంటల్లో 47వేల 884మందికి పరీక్షలు చేయగా.. 4వేల 348మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం 14వేల 204యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తంగా 20లక్షల 92వేల 227కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ సోకి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. అయితే మొత్తం 14వేల 507మంది కరోనా కారణంగా మరణించారు.





మరింత సమాచారం తెలుసుకోండి: