వన్ సైడ్ లవ్ స్టోరీ అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నా కూడా అది రెండువైపులా ఉన్నదేననే విషయం పవన్ మాటలతో తేలిపోయింది. దీంతో ఆయనపై నమ్మకం పెట్టుకున్న జనసైనికులంతా డీలా పడ్డారు. ముఖ్యంగా కాపు రాజ్యం - పవన్ తోనే సాధ్యం అంటూ స్లోగన్లు ఇస్తున్నవారంతా.. మరోసారి చంద్రబాబుతో పవన్ చేతులు కలపబోతున్నారనే సరికి ఆలోచనలో పడ్డారు. ఒకరకంగా చంద్రబాబు తెలివిగా రెండేళ్ల ముందుగానే జనసేనను క్షేత్ర స్థాయిలో బలపడకుండా చేస్తున్నారు. టీడీపీతో పొత్తు పెట్టుకునే అవకాశాలున్నాయి అంటే.. జనసేన అన్ని స్థానాల్లో పోటీ చేయలేదు అని అర్థమవుతుంది. అంటే ఆశావహులు ఇప్పటినుంచే డైలమాలో పడిపోతున్నారు.

చంద్రబాబు వల్లే ఏపీలో బీజేపీ బలపడలేకపోయింది, సొంతగా ఎదగలేకపోయిందనే వాదన ఉంది. అందుకే రాష్ట్ర విభజన తర్వాత కూడా తెలంగాణలో బీజేపీ బలం పెంచుకుంటున్నా.. ఏపీలో మాత్రం మూడో స్థానం లేదా నాలుగో స్థానం అంటూ లెక్కలు వేసుకోవాల్సిన పరిస్థితి. చంద్రబాబు వల్లే ఇదంతా అని అధిష్టానం కూడా భావించి.. గతంలో కన్నా లక్ష్మీనారాయణను రాష్ట్ర అధ్యక్షుడి స్థానం నుంచి తప్పించి, సోము వీర్రాజుకి పగ్గాలు అప్పగించారని అంటారు. కానీ సోము వచ్చిన తర్వాత కూడా పరిస్థితిలో మార్పు లేదు. ఆ విషయం పక్కనపెడితే ఇప్పుడు జనసేనలో కూడా ఆశించిన స్థాయిలో ఎదుగుదల కనిపించడంలేదు.

స్థానిక ఎన్నికల్లో జనసేనకు సీట్లు వచ్చినా.. ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉంది, అసలైన ప్రతిపక్షం మేమేనని చెప్పుకున్నంతగా ఫలితాలు రాలేదు. అయితే 2024నాటికి జనసేనని మరింతగా క్షేత్ర స్థాయిలో పటిష్టం చేస్తామంటున్నారు నేతలు. దానికి తగ్గట్టే క్యాడర్ కూడా కష్టపడుతోంది. అయితే వారికి జనసేనాని నుంచి ఆ స్థాయిలో సపోర్ట్ ఉందా లేదా అనే విషయమే తేలాల్సి ఉంది. వాస్తవానికి జనసైనికులు ఎప్పుడూ పొత్తులు కోరుకోరు. సొంతగానే తమ బలం చూపించాలనుకుంటున్నారు. 2019లో పరాభవాలు ఎదురైనా.. 2024నాటికి మాత్రం తమ బలం కచ్చితంగా పెరుగుతుంది అనుకుంటున్నారు. సొంతగా ఎదగాలని చూస్తున్న జనసేనకి మరోసారి చంద్రబాబు అడ్డు తగిలేలా ఉన్నారు. ఇప్పటినుంచే ఆయన పొత్తుల రాగం ఆలపిస్తున్నారు. ఇప్పటికిప్పుడు పవన్, ఎటూ తేల్చకపోయినా ఎన్నికలనాటికి ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారోననే భయం జనసైనికుల్లో కనిపిస్తోంది. గతంలో బీజేపీ ఎదుగుదలను ఆపేసినట్టే, ఇప్పుడు బీజేపీని కూడా కొంతవరకే పరిమితం చేయడంలో చంద్రబాబు సక్సెస్ అవుతున్నారనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: