ఐదు రాష్ట్రాల ఎన్నికల నగారా మోగింది. వచ్చే నెల  పదవ తేదీ నుంచి మార్చి నెల 7వ తేదీ వరకు మొత్తం ఏడు విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. మార్చి పదవ తేదీన ఎన్నికల ఫలితాలు వెల్లడిస్తామని సీఈసీ వెల్లడించింది. ఇందుకోసం ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేస్తోంది కూడా. ఇప్పటికే అన్ని ప్రధాన పార్టీలు ఎన్నికలపై కసరత్తు మొదలుపెట్టాయి. ముఖ్యంగా దేశంలోనే అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌తో పాటు... పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలపైనే అందరూ దృష్టి పెట్టారు. యూపీలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని పడగొట్టాలని అటు కాంగ్రెస్, ఇటు సమాజ్ వాదీ పార్టీ కంకణం కట్టుకున్నాయి. ఇప్పటికే 120 మంది పేర్లతో యూపీలో తొలి జాబితా కూడా విడుదల చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇదే సమయంలో పంజాబ్‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఇందుకోసం పార్టీ సీనియర్ నేతలు స్వయంగా రంగంలోకి దిగారు కూడా.

పంజాబ్ రాష్ట్రంలో అధికారంలోని కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే అంతర్గత కుమ్ములాటలు తారాస్థాయికి చేరుకున్నాయి. పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూకు పార్టీలోని కొంత మంది నేతలకు మధ్య విబేధాలు తారాస్థాయిలో ఉన్నాయి. సిద్ధూతో విబేధించిన మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరేందర్ సింగ్... హస్తం పార్టీకి రాజీనామా చేశారు. ఆ తర్వాత ఆయన ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు కూడా. ఇక ప్రస్తుత ముఖ్యమంత్రి చన్నీకి సిద్ధూకు మధ్య కూడా ఇప్పుడిప్పుడే వాతావరణం చెడుతోంది. రాబోయే రోజుల్లో  ముఖ్యమంత్రి ఆయనే అంటూ నవజ్యోత్ సింగ్ సిద్ధూ వర్గం జోరుగా ప్రచారం చేస్తోంది కూడా. అయితే.. దీనిని గండి కొట్టేలా కాంగ్రెస్ అధిష్ఠానం మాత్రం ముఖ్యమంత్రి అభ్యర్థిని ఇప్పట్లో ప్రకటించేది లేదని తేల్చేసింది. దీంతో సిద్ధూ వర్గానికి గట్టి షాక్ ఇచ్చినట్లుగా అయ్యింది. ఇటు అంతర్గత కలహాలతో ఇప్పటికే తీవ్ర ఇబ్బందులు పడుతున్న కాంగ్రెస్ పార్టీ... ఈ ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్తుందో చూడాలి మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: