తెలుగుదేశం పార్టీలో బీసీ వర్గానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందనే సంగతి తెలిసిందే..మొదట నుంచి బీసీ వర్గానికి టీడీపీ పెద్ద పీఠ వేసుకుంటూ వస్తుంది..అయితే ఇటీవల కాలంలో బీసీలకు కాస్త ప్రాధాన్యత తగ్గినట్లు కనిపిస్తోంది. పైగా అధికారంలో ఉన్నప్పుడు కమ్మ సామాజికవర్గం హవా ఎక్కువ కావడంతో టీడీపీకి బీసీలు దూరం జరగడం మొదలైంది. అందుకే 2019 ఎన్నికల్లో బీసీలు జగన్ వైపుకు వచ్చేశారు. దీంతో టీడీపీకి డ్యామేజ్ జరిగింది. అయితే ఈ సారి బీసీలని తమవైపు తిప్పుకోవడానికి చంద్రబాబు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు.

ఇదే క్రమంలో పలు నియోజకవర్గాల్లో బీసీ నేతలకు ప్రాధాన్యత పెంచుకుంటూ వెళుతున్నారు. బీసీ నేతలని పెట్టడం వల్ల బీసీ వర్గాల ఓట్లు టీడీపీ వైపుకు వస్తాయనేది బాబు అంచనా. అయితే గత ఎన్నికల్లో బీసీ నేతలు నిలబడిన సరే ప్రయోజనం లేకుండా పోయింది. కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ బీసీ నేతలు విఫలమయ్యారు. ఇక ఇప్పుడు వారు సత్తా చాటాలని చూస్తున్నారు. మళ్ళీ బీసీ ఓటర్లని దగ్గర చేసుకోవడం వల్ల సక్సెస్ అవుతామని భావిస్తున్నారు.


ఉదాహరణకు కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం టీడీపీ బాధ్యతలని బీసీ నేత అయిన మాజీ మంత్రి కొల్లు రవీంద్ర చూసుకుంటున్నారు. గత ఎన్నికల్లో ఈయనకు సొంత బీసీ వర్గాలే పెద్దగా ఓట్లు వేయలేదు. అపోజిట్‌లో వైసీపీ నుంచి బరిలో దిగిన కాపు నేత పేర్ని నానికి మద్ధతు ఇచ్చారు. దీంతో కొల్లు ఓటమి పాలయ్యారు. కానీ ఈ సారి ఖచ్చితంగా గెలవాలనే పట్టుదలతో కొల్లు పనిచేస్తున్నారు. కృష్ణాలో మొదట నుంచి దూకుడుగా ఈయనే పనిచేస్తున్నారు. పైగా రెండుసార్లు అరెస్ట్ అయ్యారు. ఈ క్రమంలో మళ్ళీ సానుభూతి పెరిగి బీసీ వర్గాలు ఈయనకు దగ్గరవుతున్నాయి.

ఇక మచిలీపట్నం పక్కనే ఉన్న పెడన నియోజకవర్గ బాధ్యతలు కూడా బీసీ నాయకుడైన కాగిత కృష్ణప్రసాద్ చూసుకుంటున్నారు. దివంగత కాగిత వెంకట్రావు తనయుడైన కృష్ణప్రసాద్ గత ఎన్నికల్లో ఓడిపోయారు. కానీ ఈ సారి ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో పనిచేస్తున్నారు. అయితే ఈ సారి ఈ ఇద్దరు బీసీ నాయకులకు లక్కీ ఛాన్స్ ఉండేలా ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: