2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి 151 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. ఆ తర్వాత పక్క పార్టీలనుంచి కూడా కొంతమంది జగన్ వైపుకి వచ్చారు. అంతా బాగుంది, అందులో వైసీపీలో జగన్ మాట మాత్రమే చెల్లుబాటవుతుంది. ఈ దశలో అధినేతను ఎవరైనా ధిక్కరిస్తారని, ఆయన మాటకు వ్యతిరేకంగా వెళ్తారని, పార్టీలోనే కుమ్ములాటలు ఉంటాయని ఎవరూ ఊహించరు. కానీ ఇప్పుడు అదే జరుగుతోంది. గతంలో అంతర్గతంగా ఉన్నా కూడా ఇప్పుడది బయటపడుతోంది. వైసీపీ అనుకూల మీడియా ఈ గొడవల్ని పెద్దది చేసి చూపించకపోవచ్చు కానీ.. క్షేత్ర స్థాయిలో వైసీపీలో అంతఃకలహం మొదలైందనేమాట మాత్రం వాస్తవం.

పొద్దుటూరులో ఎమ్మెల్యే వర్సెస్ ఎమ్మెల్సీగా మొదలైన గొడవ చినికి చినికి గాలివానలా మారింది. వారిద్దరి పంచాయతీ ఇప్పుడు అధిష్టానానికి చేరింది. అంతకు ముందు చిత్తూరు జిల్లాలో ఎమ్మెల్యే రోజాకి, స్థానిక వైసీపీ నాయకులకు సయోధ్య లేకపోవడంతో ఇలాంటి గొడవే జరిగింది. ఇది కూడా అదిష్టానం వద్ద పెండింగ్ లో ఉంది. నెల్లూరు జిల్లాలో సీనియర్లకి, జూనియర్లకి తేడాలొచ్చాయి. ఈ గొడవల గురించి కూడా రెండుసార్లు సజ్జల రామకృష్ణారెడ్డి వద్ద పంచాయితీ జరిగింది, కానీ ఫలితం లేదు.

ఇక పక్క పార్టీలనుంచి వైసీపీ వైపు వచ్చిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో గొడవలు ఇంకా అలాగే ఉన్నాయి. గన్నవరం, చీరాల, విశాఖ సౌత్ నియోజకవర్గాల్లో కూడా ఇలాగే ఆధిపత్య పోరు నడుస్తోంది. ఎమ్మెల్యేకి, స్థానిక వైసీపీ ఇన్ చార్జికి మధ్య ఇంకా పూర్తి స్థాయిలో సయోధ్య కుదరడంలేదు. ఇవి బయటకు కనిపిస్తున్న ఉదాహరణలు.. జిల్లాల్లో చాలా చోట్ల ఆధిపత్య పోరు నివురుగప్పిన నిప్పులా ఉందని అంటున్నారు. వచ్చే ఎన్నికలనాటికి ఇది కచ్చితంగా బయటపడుతుంది. అంటే అప్పటికి టికెట్ల పంచాయితీ మరింత ముదురుతుందని అనుకోవచ్చు. టికెట్లు ఆశించి భంగపడిన నేతలు రెబల్స్ గా మారే ప్రమాదం ఉంది. అధికార పార్టీలో మొదలైన ఈ ముసలం.. సీఎం జగన్ కు చికాకు తెప్పించే అవకాశాలున్నాయి. అయితే ఆయన ఈ పంచాయితీలను అస్సలు పట్టించుకోవట్లేదు. సంక్షేమ కార్యక్రమాలు నిరాటంకంగా సాగేందుకే ఆయన ప్రయత్నిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: