చిరంజీవి తాజా వ్యాఖ్యలతో జనసైనికుల్లో నిరాశ పెరిగింది. 2024 ఎన్నికలనాటికి చిరంజీవి సపోర్ట్ తమకి ఉంటుందని ఆశించిన వారంతా ఇప్పుడు భంగపడినట్టే లెక్క. తాను రాజకీయాలకు దూరమని, తనకు పదవులపై ఆశ లేదని, చట్టసభలకు వెళ్లే ఆలోచన తనకు లేదని కుండబద్దలు కొట్టారు చిరంజీవి. ఇప్పుడు ఇలా చెప్పారంటే రెండేళ్ల తర్వాత జనసేన తరపున ఆయన ప్రచారానికి వస్తారని చెప్పలేం. అందుకే జనసైనికుల్లో ఒకరకమైన ఆందోళన.

చిరంజీవి, సీఎం జగన్ భేటీపై కొంతమంది కొత్త కొత్త వార్తలు ప్రచారంలోకి తెచ్చిన విషయం తెలిసిందే. అందులో చిరంజీవి రాజ్యసభ ఎంట్రీ కూడా ఒకటి. అయితే ఈ రాజ్యసభ సీటు వ్యవహారంపై చిరంజీవి చాలా త్వరగా స్పందించారు. పుకార్లు వచ్చిన వెంటనే వాటికి చెక్ పెట్టారు. సీఎం జగన్ తో తన భేటీ తర్వాత వచ్చిన పుకార్లను ఆయన ఖండించారు. అయితే ఇలా ఖండించే సందర్భంలో ఆయన రాజకీయాలపై తనదైన శైలిలో స్పందించడం విశేషం.

వైసీపీ తరపున తాను రాజ్యసభకు వెళ్లే ప్రతిపాదన ఏదీ లేదు అని చెప్పడంతోపాటు.. తాను రాజకీయాలకు దూరంగా ఉన్నానని, తనను రాజకీయాల్లోకి లాగొద్దని తేల్చి చెప్పారు చిరంజీవి. అంటే ఇప్పుడు కాదు, ఇకముందు కూడా తాను రాజకీయాలకు దూరంగానే ఉంటానని ప్రకటించినట్టే లెక్క. గతంలో చిరంజీవి పవన్ కల్యాణ్ నిర్ణయాలను సమర్థిస్తున్నట్టు కూడా చెప్పారు. ఆ సమయంలో పవన్ వెనక చిరు ఉంటారని, వచ్చే ఎన్నికలనాటికి అన్నదమ్ములిద్దరూ ప్రచార బరిలో దిగుతారని, చిరంజీవి నేరుగా పోటీ చేయకపోయినా, పవన్ తరపున బయటకు వస్తారని అంచనా వేశారు కొంతమంది. కానీ ఇప్పుడది వాస్తవరూపం దాల్చేలా లేదు. పవన్ గురించి చిరు మంచిగా మాట్లాడినా, రాజకీయాల దగ్గరకు వచ్చే సరికి చిరంజీవి అందరివాడిగా మిగిలిపోవాలనుకుంటున్నారు. అందుకే తాను రాజకీయాలకు దూరం అని తేల్చి చెప్పేశారు. అంటే అటు వైసీపీకి దగ్గరగా లేను అని చెప్పడంతోపాటు, ఇంకెవరికీ కూడా అవకాశం లేకుండా ఓ క్లారిటీ ఇచ్చారు చిరంజీవి.

మరింత సమాచారం తెలుసుకోండి: