ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గత ఎన్నికలకు ముందు చాలామంది పార్టీ నేతలకు పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కీలక పదవులు ఇస్తానని హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే పార్టీ టిక్కెట్ త్యాగం చేసినందుకు గుంటూరు జిల్లా వైసీపీ మాజీ అధ్యక్షులు, చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ కు ఎమ్మెల్సీ - మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చారు. చిలకలూరిపేట లో జరిగిన బహిరంగ సభ సాక్షిగా జగన్ ఈ మాట ఇచ్చారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన మర్రి రాజశేఖర్ వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ కోసం ఎంతో కష్టపడ్డారు. గత ఎన్నికల్లో పార్టీ టిక్కెట్ వస్తే ఆయన కచ్చితంగా ఎమ్మెల్యేగా గెలిచేవారు.

పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చిలకలూరిపేట నియోజకవర్గంలో పార్టీని ఆయన పటిష్టం చేశారు. అయితే టిడిపి నుంచి వచ్చిన విడుదల రజనీ కోసం జగన్ సీటు ఇవ్వ‌మ‌ని చెప్పడంతో ఆయ‌న సీటు త్యాగం చేయక తప్పలేదు. జగన్ అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు అవుతోంది. ఈ మూడు సంవత్సరాలలో ఎన్నో సార్లు ఎమ్మెల్సీ పదవులు భర్తీ చేశారు. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయి... ఆ తర్వాత వైసీపీ లోకి వచ్చిన నేతలకు కూడా జగన్ ఎమ్మెల్సీ పదవులతో పాటు పార్టీలో కీలక పదవులు కట్టబెట్టారు. అయితే తాను హామీ ఇచ్చిన మరి రాజశేఖర్ కు మంత్రి పదవి కాదు కదా... కనీసం ఎమ్మెల్సీ కూడా ఇవ్వలేదు.

గత ఏడాది చివర్లో మాచర్ల పర్యటనకు వచ్చిన జగన్ స్థానిక సంస్థల ఎన్నికల కోటాలో నీకు ఎమ్మెల్సీ సీటు ఇస్తున్నా అన్న అని స్వయంగా చెప్పారు. అయితే ఆ మాట కూడా జగన్ నిలబెట్టుకోలేదు. జగన్ మండలి రద్దు చేస్తాన‌ని చెప్పిన‌ప్పుడు మండలి నుంచి మంత్రులుగా ఉన్న మోపిదేవి వెంకటరమణ - పిల్లి సుభాష్ చంద్రబోస్ ల‌ను రాజ్యసభకు పంపారు. ఇప్పుడు ఆ క్రమంలోనే మర్రి రాజశేఖర్ ను ఎమ్మెల్సీ చేసి... మంత్రి చేయడం ఇష్టం లేక ఆయనను కూడా రాజ్యసభకు పంపాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

కమ్మ సామాజిక వర్గం నుంచి వైసీపీ తరఫున ఇప్పటివరకు ఎవరు రాజ్యసభకు ఎంపిక కాలేదు. ఆ మాటకు వస్తే ఆ పార్టీ తరఫున క‌మ్మ ఎమ్మెల్సీలు కూడా ఇద్దరు మాత్రమే ఉన్నారు. అది కూడా ఇటీవల ఎంపికైన తలశిల రఘు - తూమాటి మాధవరావు మాత్రమే ఉన్నారు. ఇప్పటివరకు రాజ్యసభకు రెడ్డి వర్గానికి చెందిన నేతలు మాత్రమే ఎక్కువ మంది ఎంపికయ్యారు.

ఇటు కమ్మ కోటాలో మర్రి రాజశేఖర్ ను రాజ్యసభకు నామినేట్ చేస్తే.. జగన్ మర్రి కి న్యాయం చేయడంతో పాటు మర్రి విషయంలో కమ్మ సామాజిక వర్గం లో ఉన్న అసంతృప్తికి సైతం చెక్‌ పెట్టినట్టు అవుతుందని భావిస్తున్నారట. మరి ఈసారి అయనా మ‌ర్రికి జగన్ న్యాయం చేస్తారా లేదా అన్నది జూన్‌లో తేలిపోనుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: