ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం ప్రముఖ సినిమా హీరో నందమూరి బాలకృష్ణ తో పాటు ఆయన ఇద్దరూ అల్లుళ్లు కూడా కీలక నేతలుగా కొనసాగుతున్నారు. గత ఎన్నికల్లో ఈ ముగ్గురు పోటీ చేశారు. హిందూపురం నుంచి బాలకృష్ణ రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రిగా ఉన్న బాలయ్య పెద్ద అల్లుడు నారా లోకేష్ మంగళగిరి లో ఎమ్మెల్యేగా ఓడిపోయారు. ఇక బాలయ్య చిన్నల్లుడు మెతుకుమల్లి శ్రీభరత్ వైజాగ్ ఎంపీగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో భరత్ కేవలం మూడు వేల ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయారు. భరత్ ది కూడా రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబమే. ఆయన ఇద్దరు తాతలు రాజకీయంగా దిగ్గజాలు.

ఒక తాత ఎంవీవీఎస్ మూర్తి రెండుసార్లు విశాఖ నుంచి ఎంపీగా గెలిచారు. ఇక ఆయన ఎమ్మెల్సీగా ఉన్నప్పుడే అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. మ‌రో తాత కావూరి సాంబశివరావు కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. ఆయన కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం - పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరు నుంచి రెండు సార్లు ఎంపీగా గెలిచారు. ఇక భరత్ కూడా తన తాతల‌ రాజకీయ వారసుడిగా ఎంట్రీ ఇచ్చి ఎంపీగా పోటీ చేశాడు. గత ఎన్నికల్లో భారత గెలుపు ఖాయం అనుకుంటున్న సమయంలో జనసేన నుంచి పోటీ చేసిన జేడీ లక్ష్మీనారాయణ భారీగా ఓట్లు చీల్చ‌డంతో ఓడిపోయారు.

ఇక వచ్చే ఎన్నికల్లోనూ భరత్ విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు రెడీ అయిపోతున్నారు. పార్లమెంటు నియోజకవర్గం అంతటా విస్తృతంగా పర్యటిస్తూ పార్టీ కార్యకర్తలను, జనాలను కలుస్తున్నారు. గత ఎన్నికల్లో చివర్లో టిక్కెట్ రావడంతో సరిగా ప్రచారం చేసుకోలేకపోయాం అని భావిస్తున్న భరత్... ఇప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే ఎన్నికల్లో విశాఖ ఎంపీ గెలవాలని గట్టి పట్టుదలతో ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే చాలా పకడ్బందీ ప్రణాళికల‌తో ఆయన ముందుకు వెళుతున్నారు. మరి శ్రీభరత్ ఎంపీ కోరిక వచ్చే ఎన్నికల్లో అయినా తీరుతుందేమో ? చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: