ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబునాయుడు ముందు మూడుగండాలు పొంచున్నాయి. మూడింటిలో మొదటి రెండేమో వ్యక్తిగత ప్రతిష్టకు సంబంధించింది. ఇక మూడోగండమేమో పార్టీలోని వేలాదిమంది నేతల భవిష్యత్తుకు సంబంధించింది. ఈ మూడు ఒకదానితో మరొకటి పెనవేసుకున్నుండటమే ఇక్కడ పెద్ద సమస్యగా మారిపోయింది. మొదటి రెండుగండాలేమో చంద్రబాబు, లోకేష్ పోటీ, గెలుపుకు సంబంధించింది. తాను గెలవటమే కాదు లోకేష్ ను గెలిపించుకోవటం కూడా చంద్రబాబుకు ప్రతిష్టగా మారిపోయింది.




మొన్నటివరకు టీడీపీకి కుప్పం కంచుకోటన్న మాట వట్టిదే అని తేలిపోయింది. స్ధానికసంస్ధల ఎన్నికల్లో వైసీపీ దెబ్బకు టీడీపీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఇంతకాలం సరైన ప్రత్యర్ధి లేకపోవటం వల్లే చంద్రబాబు ఏకపక్షంగా గెలుస్తున్నారన్న విషయం అర్ధమైపోయింది. దాంతో రేపటి అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు గెలుస్తారా అనే డౌట్లు పెరిగిపోతున్నాయి. ఇదే సమయంలో మంగళగిరిలో కొడుకు గెలుపు కూడా అంత వీజీకాదు. పోటీచేసిన మొదటి ఎన్నికలోనే లోకేష్ బొక్కబోల్తాపడిన విషయం తెలిసిందే.




అధికారంలో ఉన్నపుడు జరిగిన ఎన్నికలోనే లోకేష్ ఓడిపోతే ఇక ప్రతిపక్షంలో ఉండి పోటీచేస్తే గెలుస్తారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇదే సమయంలో చంద్రబాబు, లోకేష్ నియోజకవర్గాలను మార్చుకుంటారనే ప్రచారం మొదలైంది. అంటే చంద్రబాబు మంగళగిరిలోను, లోకేష్ కుప్పంలో పోటీకి దిగబోతున్నారన్నమాట. మరిప్పటికే తాను కుప్పంలోనే పోటీచేస్తానని, మంగళగిరిలోనే పోటీచేసి గెలుస్తానని లోకేష్ చేసిన సవాల్ సంగతేంటి ? ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే చంద్రబాబు తాను గెలిస్తే సరిపోదు. కచ్చితంగా కొడుకును కూడా గెలిపించుకోవాల్సిందే. రెండోసారి కూడా లోకేష్ ఓడిపోతే భవిష్యత్తు ఏమిటో చెప్పక్కర్లేదు.




పై రెండుగండాలు చంద్రబాబు వ్యక్తిగత ప్రతిష్టకు సంబంధించింది. కచ్చితంగా వాటిలో పాసవ్వాల్సిందే తప్ప వేరే దారిలేదు. ఒకవేళ రెండింటిలో ఏ ఒక్కదానిలో ఫెయిలైనా అంతే సంగతులు. ఇక మూడోగండమేమో పార్టీని అధికారంలోకి తీసుకురావటం. వచ్చే ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాకపోతే ఏపిలో పరిస్ధితి తెలంగాణాలో లాగే అయిపోవటం ఖాయం. తెలంగాణాలో పార్టీ లేకపోయినా ఏపీని చూసుకునే కాలం నెట్టుకొస్తున్నారు. అలాంటిది ఏపీలో కూడా అదే పరిస్ధితి ఎదురైతే పార్టీకి మంగళం పాడేయటమే.

మరింత సమాచారం తెలుసుకోండి: