తెలంగాణలో కరోనా, ఒమిక్రాన్ కేసుల ఉధృతి తగ్గడం లేదు. దీంతో ఈ నెల 17నుంచి ప్రారంభం కావాల్సిన విద్యాసంస్థలకు ఈ నెల 30వరకు సెలవులు పొడిగిస్తారనే ప్రచారం జరుగుతోంది. విద్యాసంస్థలు ప్రారంభమైతే విద్యార్థులకు కరోనా సోకే ప్రమాదం ఉండటంతో.. స్కూళ్లు కాలేజీలు మూసివేసి, ఆన్ లైన్ క్లాసులు నిర్వహించాలని విద్యాశాఖ ఆలోచిస్తోంది. దీనిపై ప్రభుత్వంతో చర్చలు జరిపి రేపు అధికారిక ప్రకటన చేసే అవకాశముంది.

పరిస్థితులు చూస్తుంటే తెలంగాణ రాష్ట్రంలోని విద్యాసంస్థలకు సంక్రాంతి సెలవులు పొడిగించే అవకాశమే ఉంది. ఇప్పటికే కోవిడ్ కేసులు పెరుగుతున్న కారణంగా సంక్రాంతి సెలవులను మూడు రోజులకు ముందుకు జరిపి ఈ నెల 8నుంచి 16వరకు ఇచ్చారు. అయితే కేసులు తగ్గకపోవడంతో మరికొద్ది రోజులు విద్యార్థులకు లీవ్స్ ఇవ్వడమే మేలని వైద్య ఆరోగ్య శాఖ సూచించనట్టు తెలుస్తోంది. దీంతో సెలవులు 30వ తేదీ వరకు పొడిగిస్తారని సమాచారం.

మరోవైపు కరోనా తీవ్రత పెరగడంతో మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని స్కూళ్లు, హాస్టళ్లకు జనవరి 31వరకు సెలవులు ప్రకటించింది. 1 నుండి 12వ తరగతి వరకు పాఠశాలలను మూసివేయడంతో పాటు పాటు మత పరమైన కార్యక్రమాలు, ర్యాలీలపై నిషేధం విధించింది. రాజకీయ, సాంస్కృతిక, వినోద సంబంధిత కార్యక్రమాలకు 250మందిని అనుమతించనున్నట్టు తెలిపారు. స్టేడియాల్లో 50శాతం సీటింగ్ సామర్థ్యంతో అనుమతించింది.

కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా హర్యానా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 15 నుండి 18ఏళ్ల లోపు విద్యార్థులు తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలని.. అలా వ్యాక్సిన్ తీసుకున్న వారు మాత్రమే స్కూళ్లకు హాజరుకావాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం స్కూళ్లు మూసివేసినా.. ఓపెన్ చేసిన తర్వాత వ్యాక్సిన్ తీసున్న వారినే అనుమతించాలంది. అయితే హర్యానాలో ఇప్పటి వరకు 15లక్షల మంది విద్యార్థులు టీకా తీసుకున్నారు. మొత్తానికి కరోనా వైరస్ విద్యార్థుల చదువులతో ఆడుకుంటోంది. వారి చదువులకు ఆటంకం కలిగిస్తూ వారి జీవితాలతో చెలగాటమాడుతోంది.







మరింత సమాచారం తెలుసుకోండి: