ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ ప్రక్రియను భారత్ ప్రారంభించి నేటితో ఏడాది పూర్తయింది. ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్ లైన్ వారియర్లకు గతేడాది జనవరి 16నుంచి టీకాలివ్వడం ప్రారంభించారు. మార్చి 1 నుంచి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, వృద్ధులకు ఏప్రిల్ 1 నుంచి 45ఏళ్లు పైబడిన వారికి.. మే 1నుంచి 18ఏళ్లు నిండిన వారందరికీ ఇచ్చారు. ఈ నెల 3నుంచి 15-18ఏళ్ల వారికి టీకా ఇస్తున్నారు.

ఇక తెలంగాణలో కొవిడ్ వ్యాక్సినేషన్ మొదడి డోస్ ను 100శాతం పూర్తి చేసింది. ఈ ఫీట్ ను సాధించిన తొలి పెద్ద రాష్ట్రంగా రికార్డు నెలకొల్పిందని వైద్యఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ఇప్పటికే ప్రకటించారు. రాష్ట్రంలో కొవిడ్ వ్యాక్సినేషన్ ఈ నెల 13వ తేదీతో 5కోట్ల డోసులను అధిగమించిందని వెల్లడించారు. వ్యాక్సినేషన్ లో నిరంతరం కృషి చేస్తున్న వైద్య ఆరోగ్య సిబ్బందితో పాటు పంచాయతీ, మున్సిపల్ ఇతర శాఖల సిబ్బందికి అభినందనలు తెలిపారు మంత్రి.

కరోనా చికిత్స పేరుతో కొన్ని ఔషధాలను ఇష్టారీతిన వినియోగిస్తున్నారని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు కెనడా, అమెరికా, భారత్ కు చెందిన వైద్యులు హెచ్చరించారు. కరోనా బారిన పడ్డ వారికి ఎలాంటి ట్రీట్ మెంట్ ఇవ్వాలన్న విషయంలో శాస్త్రబద్దమైన చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయన్నారు. వైద్య శాస్త్ర ఆమోదం లేకుండా అజిత్రోమైసిన్, డాక్సీసైక్లిన్, హైడ్రాక్సీక్లోరోక్విన్, ఫావిపిరావిర్, ఔషధాలను చికిత్సకు వాడుతున్నారన్నారు. హోం ఐసోలేషన్ లో ఉండి చికిత్స పొందే కరోనా రోగులకు కేంద్రం కొన్ని మార్గ దర్శకాలు జారీ చేసింది. స్వల్ప లక్షణాలు ఉన్నవారు లేదా లక్షణాలు లేని వారు హోం ఐసోలేషన్ లో ఉండి చికిత్స పొందేందుకు అర్హులని తెలిపింది. 7రోజుల హోం ఐసోలేషన్ తర్వాత మళ్లీ కరోనా టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం లేదని కేంద్రం తెలిపింది.

ఇక పార్లమెంట్ లో కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు కరోనా బారిన పడ్డ వారి సంఖ్య 850కు చేరగా... వీరిలో 250మంది సెక్యూరిటీ సిబ్బంది ఉన్నట్టు తెలుస్తోంది. ఎలాంటి లక్షణాలు లేనివారే విధులకు రావాలన్న అధికారులు.. లక్షణాలు ఉంటే రావొద్దని సూచించారు. అటు ఈ నెల 31నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: