ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా రెండున్నర ఏళ్లు సమయం ఉన్నప్పటికీ.... ఇప్పటి నుంచే అన్ని పార్టీలు ఎన్నికలపై దృష్టి సారించాయి. మరీ ముఖ్యంగా రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తాయనే సమాచారం తన దగ్గర ఉందంటూ... తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఎన్నికల వాతావరణానికి మరింత దగ్గర చేశాయి. సాధారణంగా ఎన్నికలకు ఏడాది ముందు నుంచి ఎలక్షన్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. కానీ ఏపీలో మాత్రం.... ఇప్పటి నుంచే నేతల మధ్య సవాళ్ల పర్వం మొదలైంది. మళ్లీ మాదే అధికారం అని వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తుంటే... ఎలాగైనా ఓడిస్తామంటున్నారు ప్రతిపక్ష నేతలు. ఇదే సమయంలో ఇప్పటి నుంచి ఎన్నికల్లో పొత్తులపై కూడా చర్చ జోరుగా సాగుతోంది. కలిసి ఉంటే కలదు సుఖం అనే సామెత ప్రస్తుత పరిస్థితుల్లో ఉత్తమం అని భావిస్తున్నారు ప్రతిపక్షాలకు చెందిన నేతలు.

గతంలో కలిసి కాపురం చేసిన తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీలు.... ఇప్పుడు మరోసారి చేతులు కలిపేందుకు రెడీ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా చరిత్రలో తొలి సారి ఒంటరిగా పోటీ చేసి ఘోరంగా ఓడిన టీడీపీ... మరోసారి ఆ తప్పు చేయకూడదని భావిస్తోంది. అందుకోసం బలమైన సామాజిక వర్గం అండగా ఉన్న జనసేన పార్టీతో ఎలాగైనా పొత్తు పెట్టుకోవాలని ఆరాటపడుతోంది. టీడీపీ, జనసేన నేతలు అధికార వైసీపీపై విడివిడిగా ఆరోపణలు చేస్తున్నాయి తప్ప... ఒకరిపై ఒకరు ఏ మాత్రం చిన్న మాట కూడా అనుకోవటం లేదు. జనసేనతో పొత్తు కోసం టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కానీ జనసేనాని మాత్రం.. ప్రస్తుతానికి తమకు ఎవరితో పొత్తు పెట్టుకునే ఆలోచన లేదంటూ టీడీపీని దూరం పెడుతున్నారు. అయితే కేవలం బీజేపీతో ఉన్న పొత్తు కారణంగానే పవన్ వెనుకడుగు వేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతానికి దూరంగా ఉంటున్నప్పటీకీ... రాబోయే రోజుల్లో మాత్రం టీడీపీ - జనసేన పొత్తు కొనసాగే అవకాశం ఉందని ఇప్పటికే పుకార్లు షికారు చేస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: