ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నగరా మోగింది. ఇప్పటికే దేశంలోని అన్ని ప్రధాన పార్టీలు కూడా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం కోసం తమ వంతు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. అయితే దేశంలోనే అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంపైనే అన్ని పార్టీల నేతల ప్రధానంగా దృష్టి సారించారు. యూపీలో అధికారంలో ఉన్న పార్టీనే దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతుందని నేతల భావన. అందుకోసమే యూపీలో అధికారంలోకి వచ్చేందుకు అధికార భారతీయ జనతా పార్టీతో పాటు విపక్షాలు కూడా తమ వంత కసరత్తను జోరుగా చేస్తున్నాయి. యూపీలో యోగీ ఆదిత్యానాథ్ ప్రభుత్వాన్ని ఎలాగైనా గద్దె దింపాలని అటు కాంగ్రెస్ పార్టీ, ఇటు మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్ వాదీ పార్టీ గట్టి పట్టుదలతో ఉన్నాయి. ఇందుకోసం ఇప్పటికే అవకాశం ఉన్న అన్ని మార్గాలను విపక్ష నేతలు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. బీజేపీలో అసంతృప్త నేతలను ఇప్పటికే సమాజ్ వాదీ పార్టీ టార్గెట్ చేసింది. కాషాయ పార్టీకి చెందిన ముగ్గురు మంత్రులు, ఏడుగురు ఎమ్మెల్యేలను తమ వైపు లాగేసుకున్నారు అఖిలేష్ యాదవ్.

ఇక యూపీలో కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా మహిళా ఓటర్లపైనే దృష్టి పెట్టింది. యోగీ సర్కార్‌లో మహిళలు, యువతులపై జరిగిన అత్యాచారాలు, దాడులపైనే ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ. యోగీ ఆదిత్యానాథ్ హాయాంలో మహిళలు ఎంతో ఇబ్బంది పడ్డారంటూ కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ఎన్నికల్లో జోరుగా ప్రచారం చేస్తున్నారు. అలాగే రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తే.... మహిళల కోసం తాము చేయబోయే పథకాలు అంటూ ఓ ప్రత్యేక జాబితా విడుదల చేశారు కూడా. గ్రాడ్యుయేషన్ పూర్తైన విద్యార్థినులకు ఓ స్కూటీ, ఇంటర్ పాసైన విద్యార్థులకు ఓ లాప్ టాప్, పదో తరగతి పాసైన విద్యార్థినులకు ఓ స్మార్ట్ సెల్ ఫోన్ ఇస్తామని ప్రియాంక హామీలు ఇచ్చారు. అలాగే జరుగుతున్న ఎన్నికల్లో దాదాపు 40 శాతం టికెట్లు మహిళలకే కేటాయిస్తామన్నారు. అన్నట్లుగానే 120 మందితో ప్రకటించిన తొలి జాబితాలో 40 మంది మహిళలు, 40 మంది యువతకు అవకాశం కల్పించారు హస్తం పార్టీ అగ్రనేతలు. విపక్షాల ముప్పేట దాడితో ప్రస్తుతం బీజేపీ గెలుపు కష్టమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.


మరింత సమాచారం తెలుసుకోండి:

bjp