టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు వైసీపీ భారీ కౌంట‌ర్ ఇచ్చింది. ప్ర‌స్తుతం ప‌లు ప్రాంతాల్లో ప‌ర్య‌టిస్తున్న చంద్ర‌బాబు.. వైసీపీ స‌ర్కారును కార్న‌ర్ చేస్తూ.. కామెంట్లుకుమ్మ‌రిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే రాష్ట్ర ప్ర‌భుత్వం ఈ రెండున్న‌రేళ్ల కాలంలో ఏడు ల‌క్ష‌ల కోట్ల‌కు పైగా.. అప్పులు చేసింద‌ని.. ఈ అప్పులు ఎవ‌రు తీరుస్తార‌ని.. చంద్ర‌బాబు ప్ర‌శ్నించారు. అంతేకాదు.. ఇప్పుడు జ‌గ‌న్ చేస్తున్న అప్పులు తీర్చేందుకు త‌దుప‌రి ప్ర‌భుత్వాలు ప్ర‌యాస ప‌డ‌తాయ‌ని అన్నారు.

అప్పులు చేసేస్తున్నారు కానీ.. రాష్ట్ర భ‌విష్య‌త్తును మాత్రం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని.. రాష్ట్రం ఏమైపోతుందోన‌నే బెంగ త‌న‌కు ఉంద‌ని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. అంతేకాదు.. ఇప్పుడు జ‌గ‌న్ త‌న పాల‌న‌లో దోపిడీ చేస్తున్నార‌ని.. దోచుకున్నంత దోచుకుని రేపు ప‌ద‌వి దిగిపోతార‌ని.. అప్పుడు న‌ష్టం ఎవ‌రిక‌ని.. చంద్ర‌బాబు ప్ర‌శ్నించారు. రాష్ట్రం న‌ష్ట‌పోతుంద‌ని.. త‌న ఆవేద‌నంతా రాష్ట్రం కోస‌మేన‌ని చంద్ర‌బాబు అన్నారు.

అయితే..చంద్ర‌బాబు వ్యాఖ్యల‌పై వైసీపీ నాయ‌కులు కూడా అంతే వేగంగా స్పందించారు. చంద్ర‌బాబుకు రాష్ట్రంపై అంత ప్రేమ ఉంటే.. ప్ర‌త్యేక హోదాను ఎందుకు అట‌కెక్కించార‌ని.. వారు నిల‌దీశారు. ఈ మేర‌కు సోష‌ల్ మీడియా వేదిక‌గా.. ప‌లువురు నాయ‌కులు గ‌ళం విప్పారు. ఆనాడు..కేంద్రంలోని బీజేపీతో లాలూచీ ప‌డి.. అత్యంత విలువైన ప్ర‌త్యేక హోదాను వ‌ద్ద‌ని ప్ర‌క‌టించిన‌ప్పుడు.. రాష్ట్ర భ‌విష్య‌త్తును చంద్ర‌బాబు దృష్టిలో పెట్టుకోలేదా? అని వారు ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు.

అంతేకాదు.. కేంద్రంలో ఇద్ద‌రు మంత్రుల‌ను పెట్టుకుని కూడా.. హోదాను ఎందుకు సాధించ‌లేక పోయారు?  పోల‌వ‌రం ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయ‌లేక పోయారు..? అని ప్ర‌శ్నించారు. నిజానికి ప్ర‌జ‌ల‌పైనా.. రాష్ట్రంపైనా.. ప్రేమ ఉండి ఉంటే.. రాష్ట్రంలో వెనుక‌బ‌డిన జిల్లాల‌కు అప్ప‌ట్లో కేంద్రం ఇచ్చిన 700 కోట్ల రూపాయ‌ల‌ను వెన‌క్కి తీసుకుంటే.. ప్ర‌భుత్వంలో ఉండి చంద్ర‌బాబు ఏంచేశార‌ని.. ప్ర‌శ్నించారు.

అదే స‌మ‌యంలో రాష్ట్రంపై ప్రేమ ఉండి ఉంటే.. నాడు.. కేంద్రాన్ని ఒప్పించి .. క‌డ‌ప‌లో స్టీల్ ప్లాంటును..ఎందుకు పెట్టించ‌లేక పోయార‌ని.. ప్ర‌శ్నించారు. అంతేకాదు.. కేంద్రంతో మాట్లాడి.. రాష్ట్రానికి విభ‌జ‌న హ‌క్కుల మేర‌కు రావాల్సిన నిధుల‌ను రాబ‌ట్ట‌డంలో ఎందుకు విఫ‌ల‌మ‌య్యార‌ని నిల‌దీశారు. ఒక్క‌వేలు జ‌గ‌న్ వైపు చూపిస్తే.. చంద్ర‌బాబు వైపు నాలుగు వేళ్లు చూపిస్తున్నాయ‌ని.. ఎద్దేవా చేశారు. మ‌రి దీనికి టీడీపీ నేత‌లు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: