ధర్మన ప్రసాదరావు... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఆయనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా, మాజీ మంత్రిగా వ్యవహరించారు. ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి వచ్చి రాజకీయాల్లో కీలకంగా ఎదిగారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత నమ్మకమైన నేతల్లో ధర్మాన ప్రసాద రావు ఒకరు. తొలి నాళ్లలో నరసన్నపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన ధర్మాన... 2004 నుంచి శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గాన్ని తన సొంతం చేసుకున్నారు ధర్మాన. అలాగే రాష్ట్ర రాజకీయాల్లో కూడా ధర్మాన ఓ స్పెషల్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో నిందితునిగా కూడా ధర్మాన ప్రసాదరావు పేరు ప్రస్తుతం ఉంది. 2014 ఎన్నికల ముందు వైసీపీలో చేరిన ధర్మాన... నాటి నుంచి వైఎస్ జగన్ వెంటే కొనసాగుతున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరఫున శ్రీకాకుళం నుంచి పోటీ చేసిన ధర్మాన... బంపర్ మెజారిటీతో విజయం సాధించారు.

జగన్ సర్కార్‌లో ధర్మాన ప్రసాదరావుకు మంత్రి పదవి వస్తుందని అంతా భావించారు. కానీ... ముందు నుంచి జగన్ వెంటే ఉంటున్న ప్రసాదరావు సోదరుడు కృష్ణదాస్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి కేటాయించారు జగన్. రెండో విడతలో తప్పకుండా వస్తుందని ప్రసాద్ వర్గం బలంగా నమ్ముతోంది. తొలి నుంచి విలక్షణంగా వ్యవహరించే ధర్మాన... కరోనా వైరస్ విషయంలో తన దైన శైలిలో వ్యవహరించారు. ప్రస్తుతం వైరస్ సోకిన నేతలంతా కూడా మెరుగైన వైద్యం కోసం ఇతర రాష్ట్రాలకు పరుగులు పెడుతున్నారు. రాష్ట్ర గవర్నర్ మొదలు మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ ఛైర్మన్లు, నగర పాలక సంస్థ మేయర్లు, చివరికి వార్డు కౌన్సిలర్లు కూడా హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నగరాల్లోని కార్పోరేట్ ఆసుపత్రుల్లో చేరిపోతున్నారు. మెరుగైన వైద్యం కోసం లక్షలు ఖర్చు చేస్తున్నారు కూడా. ఓ వైపు ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేదని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి చెబుతున్నా కూడా... అధికార పార్టీ నేతలే ఆ విషయాలు పట్టించుకోవడం లేదు. కానీ ధర్మాన ప్రసాదరావు మాత్రం కరోనా వైరస్ సోకితే... శ్రీకాకుళం పట్టణంలోని రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పైగా రిమ్స్‌లో వైద్య సేవలు కూడా చక్కగా ఉన్నాయని... ప్రజలంతా ప్రభుత్వ వైద్య సేవలు వినియోగించుకోవాలని ఒక ప్రకటన కూడా జారీ చేశారు. ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి డబ్బులు వృధా చేసుకోవద్దని కోరారు.


మరింత సమాచారం తెలుసుకోండి: