ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడు నాయకుడు.. అలాంటి నాయకుల్లో కేసీఆర్ ఒకరు. కేసీఆర్ నిర్ణయాలు చాలా వరకూ సంచలనాత్మకంగా ఉంటాయి. ఆయన ఏదైనా నమ్మాడంటే.. దాన్ని ఆచరణలోకి తెచ్చేందుకు చాలా ప్రయత్నిస్తారు. ఆ దారిలో వచ్చే అడ్డంకులను పెద్దగా పట్టించుకోరు. కానీ.. ఒక్కోసారి గుడ్డిగా ముందుకు వెళ్లడం కూడా ప్రమాదకరం అవుతుంది. అందుకే అలాంటి సమయాల్లో కేసీఆర్‌ వెనక్కి తగ్గేందుకు ఏమాత్రం వెనుకంజవేయరు. అలాంటి ఫ్లెక్సిబిలిటీ ఉండటం వల్లే కేసీఆర్.. అనేక సంచలన నిర్ణయాలు తీసుకోగలిగారు.


తాజాగా నలుగురు ఐఏఎస్‌ల కమిటీ కూడా అలాంటిదే అన్న భావన కలుగుతోంది. ఉద్యోగుల బదిలీల సమస్యలు, ఖాళీల భర్తీ, ఉద్యోగుల భాగస్వామ్యం వంటి అంశాలపై అధ్యయనం కోసం నలుగురు ఐఏఎస్ అధికారులతో పరిపాలనా సంస్కరణల కమిటీని కేసీఆర్ ఏర్పాటు చేశారు. పేరుకు సంస్కరణ కమిటీలా ఉన్నా... ఈ కమిటీ చేయాల్సింది బహుశా ఈ ఉద్యోగుల విభజనపై వచ్చిన అభ్యంతరాల పరిశీలనే కావచ్చు. ఉద్యోగుల విభజన ప్రక్రియపై మొదటి నుంచి అనేక వాదనలు ఉన్నాయి. వాటిని కేసీఆర్ మొదట్లో పట్టించుకోలేదు.


కానీ ఇప్పుడు విషయం తీవ్రం అవుతోంది. అందుకే  కేసీఆర్‌ వాస్తవ పరిస్థితుల అధ్యయనం కోసం ఈ కమిటీని ఏర్పాటు చేశారని అనుకోవచ్చు. అలాగే.. ఆర్డీఓలు, వీఆర్వోలు, వీఆర్ఏల సేవలను ఎలా ఉపయోగించుకోవాలి అనే అంశాన్ని కూడా ఈ కొత్త కమిటీ పరిశీలిస్తుంది. కొత్త జిల్లాల్లో, కొత్తగా ఏర్పడ్డ మండలాల్లో ఏయేశాఖలకు పని ఒత్తిడి ఎంత ఉందో అంచనా వేస్తుంది. ఇంకా అవసరమైతే కొత్తగా పోస్టుల అవసరాన్ని గుర్తిస్తుంది. ఇలాంటి అంశాలపై ఈ కమిటీ అధ్యయనం చేయాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు.

మెరుగైన పరిపాలనా సంస్కరణలతో ప్రజలకు అద్భుతమైన సేవలను అందించాలనుకుంటున్నామని సీఎం కేసీఆర్ అంటున్నారు. విద్య, వైద్యం, మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖల ద్వారా ఇంకా మెరుగైన సేవలు, మౌలిక సదుపాయాల కల్పన విషయంలో ఉద్యోగుల సేవలను ఇంకా బాగా వినియోగించుకోవడం కోసమే కమిటీ అంటున్నారు. ఈ విషయంలో ఎవరి సూచనలైనా పరిగణనలోకి తీసుకుంటామంటున్నారు కేసీఆర్.


మరింత సమాచారం తెలుసుకోండి: