ఒమిక్రాన్ వేరియంట్ పెద్ద ప్రమాదం కానప్పటికీ మున్ముందు ప్రమాదకరమైన వేరియంట్లు వస్తాయని బోస్టన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కాలం గడిచేకొద్దీ వైరస్ తక్కువ ప్రాణాంతకంగా మారతాయని చెప్పడానికి ఆధారాలేవీ లేవన్నారు. కుక్కలు, పిల్లుల లాంటి జంతువుల్లోకి వైరస్ ప్రవేశించి.. మరింత ప్రమాదకరంగా మారే అవకాశం లేకపోలేదని హెచ్చరించారు. డెల్టాకంటే రెండు రెట్లు వేగంతో ఒమిక్రాన్ వ్యాపిస్తోందని చెప్పారు.

మన దేశంలో, రాష్ట్రాల్లో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. వ్యాక్సిన్ తీసుకున్న వారికి కూడా వైరస్ సోకుతుండగా.. కొందరు తాము వ్యాక్సిన్ తీసుకున్నాములే అని అజాగ్రత్తగా ఉంటున్నారు. వ్యాక్సిన్ తీసుకున్నా.. భౌతిక దూరం పాటించడం, మాస్క్ ధరించడం, చేతులను శానిటైజ్ చేసుకోవడం లాంటి నిబంధనలను తప్పక పాటించాలి. తుమ్మినా, దగ్గినా చేతిని కాకుండా మోచేతిని అడ్డంగా పెట్టుకోవాల్సిన అవసరం ఉంది.

దేశంలో గడిచిన 24గంటల్లో కొత్తగా 2లక్షల 58వేల 89 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే 13వేల 113 కేసులు తక్కువగా వచ్చాయి. ఇక మరో 385మంది కరోనాతో మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 16లక్షల 56వేల 341 యాక్టివ్ కేసులున్నాయి. పాజిటివ్ రేటు 11.9శాతంగా ఉంది. మరోవైపు ఒమిక్రాన్ కేసుల సంఖ్య 8వేల 209కి చేరింది.  

ఇక ఢిల్లీలో కరోనా కేసులు తగ్గుముఖం ట్టాయి. వీకెండ్ కర్ఫ్యూ, ముందస్తు ఆంక్షలు విధించడం లాంటి కారణాాలతో కేసులు తగ్గినట్టు మంత్రి సత్యేందర్ జైన్ వెల్లడించారు. మరో మూడు, నాలుగు రోజులు గమనించి..కేసులు 15వేలకు చేరినప్పుడు ఆంక్షలు సడలిస్తామన్నారు. గత నెల రోజుల్లో రోజుకు 60వేల నుంచి లక్ష వరకు పరీక్షలు చేసినట్టు మంత్రి పేర్కొన్నారు. అయితే ఢిల్లీలో నిన్న 20వేల 718 కరోనా కేసులు నమోదు కాగా.. ఈ రోజు 18వేల 286కేసులు నమోదయ్యాయి. మొత్తానికి కరోనా వైరస్ ప్రజలను బెంబేలెత్తిస్తోంది. రాబోయే రోజుల్లో కొత్త వైరస్ లు వస్తాయన్న శాస్త్రవేత్తల హెచ్చరికలతో ప్రజల్లో భయాందోళనలు కలుగుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: