భార‌త్‌లో కోవిడ్ కొత్త వేరియంట్ల కార‌ణంగా మూడో వేవ్ ప్ర‌భావం పెరుగుతుండ‌టంతో ప‌లు ప్రాంతాల్లో వినోద స్థ‌లాలు, వ్యాపారాలు, విద్యాసంస్థ‌లపై మ‌రోసారి ఆంక్ష‌లు మొద‌లైన విష‌యం తెలిసిందే. ప్ర‌పంచ‌వ్యాప్తంగా అన్ని దేశాల‌నూ శ‌ర‌వేగంగా చుట్టేస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ అంత ప్ర‌మాద‌కారి కాన‌ప్ప‌టికీ డెల్టా స‌హా ఇత‌ర ప్ర‌మాద‌క‌ర వేరియంట్ల వ్యాప్తికి ఇది వాహ‌కంగా ప‌ని చేస్తోంద‌న్న అభిప్రాయాలు వైద్య నిపుణుల్లో వ్య‌క్త‌మ‌వుతున్నాయి. యూరోపియన్ దేశాలు, అమెరికా స‌హా ఇత‌ర దేశాల్లో ఇప్పటికీ రోజువారీగా ల‌క్ష‌ల సంఖ్య‌లో కొత్త కేసులు న‌మోద‌వుతుండ‌గా అక్క‌డి వైద్య వ్య‌వ‌స్థ కూడా తీవ్ర ఒత్తిడికి గుర‌వుతున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. ఇక మ‌న‌దేశంలోనూ ఈ వేరియంట్ కేసులు అంత‌కంత‌కూ పెరుగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ఒమిక్రాన్‌ను స‌మ‌ర్థంగా నిలువ‌రించేందుకు భార‌త్‌కు చెందిన ఒక ఔష‌ధ త‌యారీ కంపెనీ వ్యాక్సిన్ను అభివృద్ది చేస్తోంద‌న్న వార్త‌లు అంద‌రికీ ఊర‌ట‌ను క‌లుగ‌జేసేవే.
 
పూణె న‌గ‌రం కేంద్రంగా పని చేస్తున్న జెన్నోవా బ‌యోఫార్మా అనే ఔష‌ధ కంపెనీ ఒమిక్రాన్ నివార‌ణ‌కు వ్యాక్సిన్‌ను త‌యారుచేస్తోంద‌ట‌. మ‌రికొద్ది వారాల్లో ఇది ప్రయోగాత్మ‌కంగా ప‌రిశీల‌న‌కు సిద్ధం కావ‌చ్చ‌ని తెలుస్తోంది. పూర్తిస్థాయిలో ప‌రీక్ష‌లు నిర్వ‌హించాక దీన్ని అద‌న‌పు డోస్‌గా ఇవ్వాలో లేక స్వ‌తంత్ర వ్యాక్సిన్‌గానే వినియోగించ‌వ‌చ్చో అన్న‌ది నిర్ధార‌ణ కావ‌చ్చ‌ని స‌మాచారం. ఈ వ్యాక్సిన్ సుర‌క్షిత‌మ‌ని, రోగ‌నిరోధ‌క శ‌క్తిని కాపాడ‌టంలో ప్ర‌భావ‌వంతంగా ప‌ని చేస్తోంద‌ని తొలిద‌శ ప్ర‌యోగాల్లోనే తేల‌గా, రెండో ద‌శ ప‌రీక్ష‌ల‌ను కూడా ఈ వ్యాక్సిన్ పూర్తి చేసుకున్న‌ట్టు తెలుస్తోంది. మూడో ద‌శ ప్ర‌యోగాలు నిర్వ‌హించాక డీసీజీఐ అనుమ‌తిస్తే దేశంలోనే తొలి ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్‌గా ఇది అందుబాటులోకి వస్తుంది. ఇక కోవిడ్ 19 ను ఎదుర్కొనేందుకు తొలి ద‌శ‌లో బ‌హుళ‌జాతి ఔష‌ధ కంపెనీల త‌ర‌పున దేశంలోని కొన్ని కంపెనీలు కోవిషీల్డ్ వంటి వ్యాక్సిన్‌లు త‌యారు చేయ‌గా, దేశీయ కంపెనీ భార‌త్ బ‌యోటెక్ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ వాటికి దీటుగా పని చేస్తున్న‌ట్టు వైద్య రంగ నిపుణులు నిర్దారించిన విష‌యం తెలిసిందే. దేశీయంగా వ్యాక్సిన్లు ల‌భ్య‌మైతే ప్ర‌భుత్వంపై ప‌డే భార‌మూ త‌గ్గే అవ‌కాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: