ఎన్టీఆర్(N.T.R) ..... ఈ మూడు అక్షరాలకు ఉన్న చరిత్ర గురించి ఎంత చెప్పిన తక్కువే!నటుడిగా , రాజకీయ వేత్తగా తెలుగు వారి ఖ్యాతిని నలుదిశలా చాటి చెప్పిన  మహనీయుడు , తెలుగు వారి ఆత్మగౌరవానికి ప్రతీక మరియు ఆంధ్రుల ఆరాధ్య దైవం అయిన ఈ విశ్వ విఖ్యాత నట సార్వభౌముడి 26 వ వర్థంతి నేడు. 

ఎన్టీఆర్ గా సూపరిచితులైన నందమూరి తారక రామారావు గారు సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించి స్వశక్తితో అంచెలంచెలుగా ఎదిగి భారత దేశ సిని, రాజకీయ రంగాల్లో తనకంటూ ప్రత్యేకమైన అధ్యాయాన్ని సృష్టించుకున్నారు. 

తన ఉద్యోగ ధర్మంలో అవినీతితో రాజీ పడలేక తాను నమ్మిన ఆశయాలకు , ఆదర్శాలకు అనుగుణంగా ఏంతో కష్టపడి  సాధించిన సబ్ రిజిస్ట్రార్(ఆనాటి ఉమ్మడి మద్రాస్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కేవలం 4 ఉద్యోగాలు కోసం నిర్వహించిన పరీక్ష లో ఆంధ్ర ప్రాంతం నుంచి ఉత్తీర్ణత సాధించిన ఏకైక వ్యక్తి) వంటి ఉన్నత శ్రేణి ఉద్యోగానికి రాజీనామా చేసిన అరుదైన వ్యక్తి ఎన్టీఆర్. 

 తెలుగు చిత్ర పరిశ్రమలో ఆనాటి తన తోటి హీరోల్లా ఎన్టీఆర్ ఒకే తరహా పాత్రలకే పరిమితం కాకుండా సాంఘిక, జానపద మరియు అనేక విశిష్టతో కూడిన వైవిధ్యభరితమైన  (శ్రీరాముడు, కృష్ణుడు, వెంకటేశ్వరుడు వంటి దైవత్వం కలిగిన పాత్రలతో పాటుగా రావణ , దుర్యోధనుడు వంటి చారిత్రాత్మక ప్రతినాయక పాత్రలు) పాత్రలు పోషించి తనలోని నట తృష్ణ ను తీర్చుకోవడమే కాకుండా ప్రేక్షకులను సైతం మెప్పించారు .

నటుడిగా, దర్శకుడిగా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో పలు ప్రయోగాలకు నాంది పలకడమే కాకుండా, నిర్మాత గా అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో సినిమాలు నిర్మించిన  ఏకైక వ్యక్తి  ఎన్టీఆర్ .  

హీరోగా ఉచ్చస్థితిలో ఉన్న సమయంలోనే అధికారమే పరమావధిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆత్మ గౌరవాన్ని ఢిల్లీ పెద్దల పాదాల చెంత తాకట్టు పెట్టిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు తీరును నిరసిస్తూ తెలుగు వారి ఆత్మగౌరవం పేరుతో  తెలుగుదేశం పార్టీని స్థాపించి దేశ రాజకీయాల్లో అప్పటి వరకు సుసాధ్యం కానీ కనీవినీ ఎరుగని రీతిలో కేవలం 8 నెలల్లో అధికార కాంగ్రెస్ పార్టీని మట్టికరిపించి రాష్ట్ర  ముఖ్యమంత్రి గా భాద్యతలు చేపట్టారు. 

ముఖ్యమంత్రి గా ప్రజల సంక్షేమం కోసం 2 రూపాయలకే కిలో బియ్యం, సగం ధరకే జనతా వస్త్రాలు , పక్కా ఇళ్లు మంజూరు, రైతుల కోసం 50 రూపాయలకే హార్స్ పవర్ విద్యుత్ అందించడం , రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా వితంతువులకు పింఛన్లు పంపిణీ చేశారు. 

పాలన పరంగా ఆయన తీసుకున్న  పటేల్ & పట్వారీ (తెలంగాణ) మునుసుబు&  కరణాలు(ఆంధ్రప్రదేశ్) వ్యవస్థల రద్దు, పరిపాలన వికేంద్రీకరణ లో భాగంగా సమితి వ్యవస్థ ను రద్దు చేసి మండలాల వ్యవస్థ ఏర్పాటు, ఉన్నత స్థాయి విద్యను ప్రక్షాళన చేయడం, స్త్రీలకు ఆస్తిలో హక్కు, సంపూర్ణ మద్యపాన నిషేధం, వెనుకబడిన తరగతులకు చెందిన ప్రజానీకానికి రాజకీయ, విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించడం వంటి పలు నిర్ణయాలు చరిత్రలో నిలిచిపోయాయి.  

 వారసత్వం పుట్టుకొస్తున్న సమయంలోనే  ఎన్టీఆర్ రాష్ట్రవ్యాప్తంగా ఏంతో మంది సాధారణ మధ్యతరగతి, వెనుకబడిన తరగతుల కుటుంబాలకు చెందిన యువత ను, కార్మిక, కర్షక మరియు మైనారిటీలను , మహిళలను  నాయకులుగా తీర్చిదిద్ది రాజకీయాల్లో తగినన్ని అవకాశాలు కల్పించారు. ఆయన కల్పించిన అవకాశాలు సద్వినియోగం చేసుకుని ఏంతో మంది రాజకీయాల్లో రాణించారు అలాంటి వారిలో ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకరు. 

కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలకే పరిమితం కాకుండా జాతీయ రాజకీయాల్లో సైతం చక్రం తిప్పారు. గవర్నర్ వ్యవస్థ మీద తిరుగుబాటు చేసిన మొదటి ముఖ్యమంత్రి. జాతీయ స్థాయిలో 1989లో కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక శక్తులతో కలిసి నేషనల్ ఫ్రంట్ కూటమిగా ఏర్పాటు చేశారు. తానే స్వయంగా ఫ్రంట్ అధ్యక్ష భాద్యతలు చేపట్టి సార్వత్రిక ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ఓటమిలో మరియు ఫ్రంట్ తరుపున వి.పి.సింగ్ ప్రధానమంత్రి కావడంలో సైతం కీలకమైన పాత్ర పోషించారు. 

ఎన్టీఆర్ భోళా మనిషి మనసులో ఒకటి , మాటలో ఒకటి ఆయనకు అలవాటు లేని విద్యలు. అందువల్లనే పదవి ప్రలోభాలకు , అధికార ప్రలోభాలకు అతీతంగా ఉంటూ వచ్చిన ఆయన వ్యక్తిత్వం అజేయం.ఈరోజు భౌతికంగా మన మధ్యన లేకపోయిన తెలుగు జాతి ఉన్నంత వరకు ప్రతి ఒక్కరి హృదయాల్లో ఎల్లప్పుడూ చిరస్థాయిగా నిలిచిపోతారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: