నరేంద్ర మోదీ... 2014 సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కూటమి ఘన విజయం సాధించడం ఎంతో కీలక పాత్ర పోషించారు. నమో అనే నినాదంతో అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకున్నారు. ఇక భారత దేశ ప్రధాని పీఠంపై అధిరోహించిన మోదీ.... ప్రపంచ దేశాలతో అత్యంత సన్నిహితంగా మెలిగారు. అదే సమయంలో ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నేతల జాబితాలో అగ్రస్థానంలో కూడా నిలిచారు. ఇక 2019 సార్వత్రిక ఎన్నికల్లో అయితే... భారతీయ జనతా పార్టీ తొలిసారి ఏకంగా 300 పై చిలుకు లోక్ సభ స్థానాలు గెలవటంలో మోదీ పాత్ర ఎంతో కీలకం. పూర్తిస్థాయి మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన మోదీ సారుకు... ప్రస్తుతం గడ్డుకాలమే నడుస్తోంది. గతంలో ఆయన చేసిందే చట్టం... చెప్పిందే శాసనం... అన్నట్లుగా పరిస్థితి ఉండేది. కానీ ప్రస్తుత పరిస్థితి మాత్రం పూర్తి విరుద్ధం. గతంలో మట్టి చూపించి బంగారం అని చెప్పిన మోదీ మాటలను ప్రస్తుతం ఓటర్లు విశ్వసించేలా కనిపించడం లేదు.

వ్యవసాయ రంగంలో పెను మార్పు తీసుకువస్తామని... రైతులకు మేలు చేస్తామని... అలాగే లాభాల పంట కురిపిస్తామంటూ మోదీ సర్కార్ ఎన్ని మాటలు చెప్పినా కూడా వాటిని రైతులు విశ్వసించలేకపోయారు. 2020 పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం కొత్త వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చింది. దీనిపై తొలి నుంచి మోదీ సర్కార్‌పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయ్యింది. కార్పోరేట్ సంస్థలకు లాభం జరిగేలా ఈ చట్టాలు ఉన్నాయని రైతులు ఆందోళన బాట పట్టారు. దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దులను దిగ్భందం చేశారు. ఏడాది పాటు ఆందోళనలు కొనసాగించారు. చివరికి యూపీ, పంజాబ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు మోదీ ప్రకటించారు. అయితే తమ ప్రభుత్వ నిర్ణయంతో రైతులు బీజేపీకి మద్దతు తెలుపుతారని అనుకున్నారు ప్రధాని. కానీ మోదీ సార్ ఆశలన్నీ అడియాశలయ్యాయి. రైతుల్లో మెజారిటీ భాగం యూపీ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేయాలని తీర్మానం చేశారు. తాము ఈ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఎస్పీ-ఆర్ఎల్‌డీ కూటమికి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు భారతీయ కిసాన్ యూనియన్ నేత నరేష్ తికాయత్. దీంతో ప్రస్తుతం మోదీ సార్ ప్లాన్ పూర్తిగా రివర్స్ అయినట్లే తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: