శంఖంలో పోస్తే కానీ తీర్థం కాదు అంటూ పెద్దలు... అది మంచినీరు అయినా, ఉప్పు నీరు అయినా సరే... శంఖంతో పోస్తే ఎంతో భక్తితో స్వీకరిస్తారు. ప్రస్తుతం ఇదే మాట టాలీవుడ్‌లో జోరుగా వినిపిస్తోంది. ప్రసుత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సినిమా పరిశ్రమకు మధ్య పెద్ద యుద్ధమే జరుగుతోంది. ఇందుకు ప్రధాన కారణం ఇకపై అన్ని సినిమా థియేటర్లలో ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే టికెట్లు విక్రయించాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. అది కూడా కేవలం ఆన్ లైన్ ద్వారా మాత్రమే అమ్మాలని ఆదేశాలు జారీ చేసింది. దీనితో పాటు బెనిఫిట్ షో పేరుతో... అదనపు షోలు వేయడంపై కూడా నిషేధం విధించింది జగన్ సర్కార్. ఇందుకోసం అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో సినిమాటోగ్రఫీ చట్టంలో మార్పులు కూడా చేసింది. దీనిపై అన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. చివరికి పెద్ద సినిమాలకు లాభాలు రావు అంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ఇక సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా ఏపీ సర్కార్ తీరును సోషల్ మీడియా వేదికగా ఎండగట్టారు. సినిమా పరిశ్రమపై ప్రభుత్వ పెత్తనం ఏమిటని నిలదీశారు. చివరికి మంత్రి పేర్ని నానితో కూడా స్వయంగా భేటీ అయ్యారు.

ప్రస్తుతం సినీ పరిశ్రమకు పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. అయితే తొలి నుంచి వివాదాలకు దూరంగా ఉంటున్న చిరంజీవి... ఈ విషయంపై కూడా ఆచితూచి వ్యవహరించారు. ఒక దశలో తాను పెద్దను కాదని... ఇద్దరు కొట్టుకుంటుంటే మధ్యలో వెళ్లే పరిస్థితి లేదన్నారు చిరంజీవి. అయితే... సడన్‌గా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో సమావేశమయ్యారు చిరంజీవి. ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి గన్నవరం చేరుకున్న చిరంజీవి... నేరుగా ముఖ్యమంత్రిని కలిశారు. కాసేపు మాట్లాడారు. టికెట్ల ధరలు, బెనిఫిట్ షోల వ్యవహారంపై సానుకూల నిర్ణయం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతే.. పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. అప్పటి వరకు పరిశ్రమ నుంచి వస్తున్న విమర్శలకు బ్రేక్ పడింది. టికెట్ల వ్యవహారంపై సినీ హీరోల కామెంట్లకు చెక్ పెట్టే బాధ్యతను చిరంజీవికి అప్పగించారు చిరంజీవి. దీంతో టాలీవుడ్ నుంచి ఎవరూ ఈ విషయంపై మాట్లాడవద్దని చిరంజీవి సూచించినట్లు తెలుస్తోంది. తద్వారా టాలీవుడ్ నుంచి వైసీపీ ప్రభుత్వంపై రెచ్చిపోతున్న హీరోల్ని కట్టడి చేసేందుకు ప్రయత్నించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: