2019 ఎన్నికల సమయంలో జగన్ జనంలో విస్తృతంగా పర్యటించారు. వాస్తవానికి అప్పటి టీడీపీ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతతోపాటు.. జనంలో జగన్ చేసిన పాదయాత్ర వల్లే ఆయన అధికారంలోకి వచ్చారని అంటుంటారు. అది ఎంతవరకు వాస్తవం, పాదయాత్ర చేయకపోతే జగన్ అధికారంలోకి వచ్చి ఉండేవారు కాదా..? అనే ప్రశ్నల్ని పక్కనపెడితే.. జనంలోకి రావడం వల్ల జగన్ మైలేజీ అమాంతం పెరిగింది. జగన్ లో జననేత వైఎస్ఆర్ ని చూసుకున్న ప్రజలు.. ఆయన్ని ఆరాధించారు, అభిమానించారు, అందలమెక్కించారు. మరి ఇప్పుడేమైంది..? జగన్ జనంలోకి వచ్చి ఎన్నాళ్లయింది. అడపాదడపా కొన్ని కార్యక్రమాలకోసం వచ్చి జనంతో సెల్ఫీలు దిగి వెళ్లిపోతున్నారే కానీ.. గతంలో లాగా నేరుగా ప్రజల సమస్యలు అడిగి తెలుసుకునే పరిస్థితి ఉందా..? ఒకవేళ ఉన్నా కూడా ప్రజలు తమ సమస్యలను జగన్ కి చెప్పుకోగలరా..? స్థానిక నాయకులు వారికి ఆ అవకాశం ఇస్తారా..?

జనం బాట ఎప్పుడు..?
జగన్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటిపోయింది. అసలు తన పాలన ఎలా ఉంది, జనం ఏమనుకుంటున్నారు.. ఏమేం మార్పులు చేసుకోవాలి. వచ్చేసారి కూడా అధికారంలోకి రావాలంటే ముందున్న కాలాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి. సగటు నాయకుడెవరైనా ఇదే ఆలోచిస్తారు. అలా ఆలోచించకపోతే భవిష్యత్తులో జరిగే పరిణామాలకి బాధ్యత వహించాల్సి ఉంటుంది. మరి జగన్ ఏం ఆలోచిస్తున్నారు..? ఎప్పుడు జనాల్లోకి వస్తారు..?

తన తండ్రితో ఆగిపోయిన రచ్చబండ కార్యక్రమాన్ని తిరిగి మొదలు పెట్టాలనేది సీఎం జగన్ ఆలోచన. కానీ దానికి ఇప్పటికే చాలాసార్లు బ్రేక్ పడింది. కరోనా వల్ల రచ్చబండ అలా మొదలవుతుందనుకున్న టైమ్ లో ఇలా ఆగిపోయేది. అయితే ఎన్నికల లోగా జగన్ రచ్చబండ కార్యక్రమాన్ని తిరిగి మొదలు పెట్టాల్సిందేనంటున్నాయి పార్టీ శ్రేణులు. జగన్ తన పాలనపై ప్రజల్లో ఉన్న అభిప్రాయాన్ని స్వయంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. ఒకరకంగా పార్టీనుంచే కాదు, ప్రజల నుంచి కూడా జగన్ పై ఆ ఒత్తిడి ఉంది. మరి ప్రజా బాట మరోసారి ఎప్పుడు మొదలవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: