గణతంత్ర వేడుకల కోసం దేశ రాజధాని ఢిల్లీ నగరం ముస్తాబవుతోంది. ప్రతి ఏటా రిపబ్లిక్ వేడుకలను మూడు రోజుల పాటు కేంద్రం ఘనంగా నిర్వహిస్తుంది. జనవరి 24వ తేదీ నుంచి 26వ తేదీ వరకు వేడుకలు నిర్వహించడం ఆనవాయితీ. అయితే ఈసారి మాత్రం కేంద్రం తన నిర్ణయాన్ని మార్చుకుంది. దేశానికి స్వాతంత్ర్య వచ్చి 75 ఏళ్లు పూర్తి అవుతున్న సందర్భంగా ప్రత్యేక సంబరాలకు సిద్దం అవుతోంది ఎర్రకోట. ఈ నేపథ్యంలో ఈ ఏడాది రిపబ్లిక్ వేడుకలను మరింత ఘనంగా నిర్వహించనుంది కేంద్రం. అందుకోసం వేడుకలను మూడు రోజులకు బదులుగా నాలుగు రోజులు నిర్వహించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ నెల 23వ తేదీ నుంచి 26వ తేదీ వరకు వేడుకలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నాలుగు రోజుల పాటు ఎర్రకోట పరిసరాల్లో గణతంత్ర దినోత్సవ సంబరాలు ఘనంగా జరగనున్నాయి. ప్రతి ఏటా జనవరి 23వ తేదీన నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలను కేంద్రం అధికారికంగా నిర్వహిస్తుంది. దీనిని పరాక్రమ్ దివస్‌గా మోదీ సర్కార్ ప్రకటించింది.

బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మమతా బెనర్జీతో బీజేపీ చేసిన పోరులో భాగంగా మోదీ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. తమకు నేతాజీ అంటే ఎంతో గౌరవం ఉందని ప్రకటించిన ప్రధాని మోదీ... నేతాజీ జయంతిని పరాక్రమ్ దివస్‌గా ప్రకటించారు. దీంతో ఈ వేడుకలను ఈసారి రిపబ్లిక్ డే సందర్భంగానే నిర్వహించాలని కూడా కేంద్రం నిర్ణయం తీసుకుంది. అందుకోసం ఎర్రకోట వద్ద గణతంత్ర దినోత్సవ వేడుకలను ఒకరోజు ముందు నుంచే నిర్వహించనున్నారు. జనవరి 23న నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి నుంచే రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించడం ద్వారా ఆయన్ను గౌరవిస్తున్నట్లు చెప్పుకోవచ్చేనేది కేంద్ర ప్రభుత్వ ఆలోచన. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సుభాష్ చంద్రబోస్ మేనల్లుడు చంద్ర కుమార్ బోస్ స్వాగతించారు. మోదీ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని దేశ ప్రజలంతా అభిమానిస్తున్నారని కూడా తెలిపారు. నేతాజీ సూచించిన సమ్మిళిత సిద్ధాంతాన్ని అమలు చేయడం కూడా కేంద్ర ప్రభుత్వంపైనే ఉందన్నారు చంద్ర కుమార్. మతంతో సంబంధం లేకుండా భారతీయులంతా కలిసి ఉండాలనేదే నేతాజీ సిద్ధాంతం అని కూడా వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: