నారావారి వారసుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఎక్కడా కనబడటంలేదు, వినబడటంలేదు. ఒకపుడు అంతా తానై నడిపించేందుకు ప్రయత్నించారు. మాచర్లలో పార్టీ కార్యకర్త హత్య జరిగిన నేపధ్యంలో ట్విట్టర్ కు మాత్రమే చినబాబు పరిమితమైపోయారు. కార్యకర్త దహనసంస్కారాలకు చంద్రబాబునాయుడు వెళ్ళారే కానీ లోకేష్ ఎక్కడా కనబడలేదు. చివరకు కనీసం ఈ విషయంలో మీడియా ముందుకు కూడా రాలేదు. ఇపుడంటే కరోనా వచ్చింది సరే అంతకుముందంతా ఏమైంది ?




కుప్పం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో చివరిసారిగా కనిపించిన చినబాబు మళ్ళీ మీడియాలో కూడా ఎందుకు కనబడటంలేదో అర్ధం కావటంలేదు. ఆమధ్య రెగ్యులర్ గా కొన్ని జిల్లాల్లో తిరిగారు. మీడియా ముందుకు కూడా తరచూ వచ్చి జగన్మోహన్ రెడ్డికి చాలాసార్లే వార్నింగులిచ్చారు. ఏదోలే చినబాబు స్పీడు పెంచుతున్నారని అందరు అనుకున్నారు. అలాంటిది సడన్ గా కారును షెడ్లో పెట్టేసినట్లు లోకేష్ ట్విట్టర్ కు మాత్రమే పరిమితైపోయారు.




నిజానికి ట్విట్టర్ కామెంట్లు కూడా డైరెక్టుగా లోకేష్ చేస్తున్నది కాదట. లోకేష్ తరపున సోషల్ మీడియా వ్యవహారాలు చూసుకునే టీం ఒకటుంది. అదే రెగ్యులర్ గా ట్విట్లు పెడుతుంటుందని టాక్. సో జరుగుతున్న ప్రచారం చూస్తే లోకేష్ కు పెద్ద పనేం ఉన్నట్లు లేదు. ఎందుకంటే నియోజకవర్గాల్లోని నేతలతో సమీక్షలు చంద్రబాబే చేస్తున్నారు. పార్టీ నేతల వ్యూహకమిటి సమావేశాలు కూడా చంద్రబాబే నిర్వహిస్తున్నారు.




కప్పంలో మూడు రోజులు పర్యటించటం, తాజాగా మాచర్లకు వెళ్ళింది కూడా చంద్రబాబే. 72 ఏళ్ళ వయసులో కూడా చంద్రబాబే అన్నీ పనులు చూసుకుంటున్నపుడు మరి 40 ల్లో ఉన్న చినబాబు ఏమి చేస్తున్నట్లు ? పార్టీలో ఆమధ్య యువనేతలు కొద్దిగా హడావుడి చేశారు. అప్పుడు కూడా చంద్రబాబే కనిపించారు. ఇలా పార్టీలో ఏ టు జడ్ చంద్రబాబే కనిపిస్తున్న కారణంగా  లోకేష్ కు ఏమైందో అర్ధం కావటంలేదు. లోకేష్ బ్యాక్ అయిపోయారా ? లేకపోతే చంద్రబాబే బ్యాక్ చేసేశారా ?

మరింత సమాచారం తెలుసుకోండి: