తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కరోనా బారిన పడ్డారు. మైల్డ్ సింప్టమ్స్ ఉండగా టెస్టు చేయించుకుంటే పాజిటివ్ గా తేలిందని ఆయన సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ప్రస్తుతం హోం క్వారంటైన్ లో ఉన్నట్టు చెప్పారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నానని వెల్లడించారు. ఇక నిన్న నారా లోకేశ్ కు సైతం కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.

కరోనా నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు త్వరగా కోలుకోవాలని సీఎం జగన్ ఆకాంక్షించారు. అయితే ఎన్టీఆర్ వర్ధంతి నాడే చంద్రబాబుకు కరోనా రావడం యాధృచ్ఛికమని వైసీపీ నేత విజయసాయి రెడ్డి అన్నారు. ఇక కరోనా బారిన పడిన టీడీపీ అధినేత చంద్రబాబు త్వరగా కోలుకోవాలని.. జూనియర్ ఎన్టీఆర్ ఆకాంక్షించారు. సోషల్ మీడియాలో స్పందించిన ఎన్టీఆర్.. మామయ్య మీరు త్వరగా కోలుకోవాలి. నారా లోకేశ్ కూడా త్వరగా కరోనా నుంచి బయటపడాలి అని పోస్ట్ చేశాడు. అటు మెగాస్టార్ చిరంజీవి, ఏపీ గవర్నర్ సహా పలువురు చంద్రబాబు, లోకేశ్ కరోనా నుంచి కోలుకోవాలని పోస్ట్ లు పెడుతున్నారు. కరోనా బారిన పడిన చంద్రబాబు త్వరగా కోలుకోవాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు.

టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ కరోనా  బారినపడ్డారు. ఆయన కోవిడ్ టెస్ట్ చేయించుకోగా.. పాజిటివ్ గా నిర్ధారణ అయిందని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. డాక్టర్ల సలహా మేరకు అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నానన్నారు. గత కొన్ని రోజులుగా తనను కలిసిన వారు కోవిడ్ పరీక్షలు చేయించుకోవాల్సిందిగా కోరారు.

గడిచిన 24గంటల్లో రాష్ట్రంలో 38వేల 55 టెస్టులు చేయగా.. కొత్తగా 6వేల 996 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో నలుగురు చనిపోయారు. మరోవైపు 1066 మంది పూర్తిగా మహమ్మరి నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 36వేల 108యాక్టివ్ కేసులున్నాయి. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 1534కేసులు వచ్చాయి.










మరింత సమాచారం తెలుసుకోండి: