పెళ్లంటే నూరేళ్ల పంట.. పెళ్లంటే ఆకాశమంత పందిరి.. భూదేవి అంత అరుగు.. ఇలా అనేక సామెతలు, పొడుపు కథలు, నానుడులతో పెళ్లంటే అదో అద్భుత ఘట్టంగా మన మనోఫలకాలపై పడిపోయింది. అయితే.. ఈ పెళ్లి పేరుతో జరుగుతున్న విందు భోజనాలు, పెళ్లి ఖర్చులు విపరీతంగా పెరిగాయి. ఇవన్నీ కలిసి ఆడపిల్ల తండ్రుల గుండెలపై కొత్త కుంపట్లు రేపుతున్నాయి. ముస్లింలలో అమ్మాయి పెళ్లి చేయాలంటే చుక్కలు కనిపిస్తున్నాయి. నికా ఖర్చు అమ్మాయి తల్లిదండ్రులకు భరించలేనంతగా తడిసి మోపెడవుతోంది.


ప్రత్యేకించి వరుడి తల్లిదండ్రులు పెళ్లిలో విందు అదిరిపోయవాలని డిమాండ్ చేస్తుంటారు. అమ్మాయి తల్లిదండ్రులకు కట్నకానుకలు సమర్పించుకోవడంతో పాటు విందు ఖర్చు కూడా  తడిసిమోపెడవుతోంది. అందుకే ఈ పెళ్లి భారం నుంచి గట్టెక్కించేందుకు ఓ గ్రామస్థులంతా ఒక్కటిగా నిలిచారు. తమ ఊళ్లో జరిగే పెళ్లిళ్లలో కేవలం ఒకే ఒక్క వంటకంతోనే విందు ఉండేలా చూడాలని తీర్మానం పాస్ చేసుకున్నారు.


అంతే కాదు.. ఎవ్వరూ తమ కుమార్తెల వివాహ విందులో బగారా, చికెన్, ఒక స్వీటు తప్ప ఇతర వంటకాలేవీ వడ్డించకూడదని ముస్లిమ్ సంఘాల పెద్దలంతా ముక్తకంఠంతో తీర్మానించుకున్నారట. వేములవాడ ముస్లిములు తీసుకున్న ఈ కొత్త నిర్ణయంపై సోషల్ మీడియాలో బాగా స్పందన వస్తోంది. ఈ కొత్త ప్రయత్నాన్ని వాట్సాప్ గ్రూపుల్లో పెడితే.. అందరూ అభినందిస్తున్నారు. పెళ్లిళ్లలో పేద, ధనిక అనే తాహతు చూడకూడదంటారు. కానీ.. మగ పెళ్లివారు విందు గొప్పగా జరగాలనే డిమాండ్‌ ముందునుంచే పెడుతున్నారు.


అందుకే పెళ్లి పేరుతో ఆడపిల్లల తల్లిదండ్రులు ఆర్థికంగా చితికిపోకూడదని వేములవాడ ముస్లిమ్ టౌన్ కమిటీ ఇలాంటి నిర్ణయం తీసుకుంది. ఈ కమిటీ అధ్యక్ష, ఉపాధ్యక్షులు ముహమ్మద్ అక్రమ్, సయ్యద్ రసూల్ ఈ మేరకు రాసిన ఓ బహిరంగ లేఖ బాగా వైరల్ అవుతోంది. వాస్తవానికి  ఆడపిల్ల పెళ్లిలో విందు ఏర్పాటు చేసే ఆచారానికి ఇస్లాంలో తావు లేదట. కానీ విందు ఖర్చు మొత్తం పెళ్లికూతురు తండ్రే భరిస్తాడు. ఇకపై అలాంటి ఆర్థిక భారం పడకుండా తీర్మానించడం ప్రశంసనీయం.

మరింత సమాచారం తెలుసుకోండి: