ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఏకంగా 151 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుని అధికారంలోకి వచ్చింది వైసీపీ. దాదాపు 9 ఏళ్ల తర్వాత పార్టీ అధికారంలోకి రావడంతో... పదవులపై కొంత మంది నేతలు ఆశలు పెట్టుకున్నారు. ప్రధానంగా మంత్రివర్గంలో స్థానం వస్తుందని అంతా గట్టి నమ్మకంతో ఉన్నారు. కానీ పార్టీ తొలి శాసనసభా పక్ష సమావేశంలోనే ముఖ్యమంతరి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి క్లారిటీ ఇచ్చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ అవకాశం ఉంటుందని చెప్పేశారు. అలాగే గతంలో ఎన్నడూ లేని విధంగా మంత్రివర్గం రెండు విడతుల్లో ఏర్పాటు అవుతుందని తెలిపారు. తొలి రెండున్నర ఏళ్ల పాటు ఒకటి, తర్వాత రెండున్నర ఏళ్ల కాలం రెండవ మంత్రివర్గం ఏర్పాటవుతుందని తెలిపారు. దీంతో అసంతృప్తులు కాస్త మెత్తబడ్డారు. ప్రస్తుతం జగన్ చెప్పిన గడువు ముగిసి పోయింది. ఇంకా చెప్పాలంటే రెండున్నర ఏళ్లు దాటి రెండు నెలలు కూడా అయ్యింది.

ప్రస్తుతం అధికార వైసీపీ నేతల్లో ఒకటే చర్చ. అసలు మంత్రివర్గ విస్తరణ ఉంటుందా.. లేదా... అనేది. దీనికి ప్రధాన కారణం ప్రస్తుత మంత్రివర్గ గడువు ముగిసిపోవడమే. రెండున్నర ఏళ్లు గడిచినా కూడా పార్టీలో మంత్రివర్గ కూర్పుపై ఎలాంటి చర్చ జరగటం లేదు. గతంలో ఎప్పుడో నాలుగు నెలల క్రితం... సెప్టెంబర్ 16వ తేదీన జరిగిన కేబినెట్ భేటీలో మంత్రుల మార్పునకు వేళ అయ్యింది అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. మాజీలకు పార్టీ బాధ్యతలు అప్పగిస్తామని.. తాజా టీమ్ ఎన్నికల టీమ్ అని కూడా కామెంట్ చేశారు జగన్. దీంతో దసరా పండుగకు అవకాశం ఉంటుందని అంతా భావించారు. దసరా పోయింది. దీపావళి పండుగ సమయానికి దాదాపు ఖరారని భావించారు. అదే సమయంలో అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నిర్వహించారు. ఇక శాసన మండలి ఖాళీల భర్తీ కూడా పూర్తి చేశారు జగన్. దీంతో... డిసెంబర్ మొదటి వారం లేదా జగన్ పుట్టిన రోజు నాటికి కొత్త మంత్రివర్గం కొలువు తీరుతుందని అంతా భావించారు. అదీ జరగలేదు. సంక్రాంతి నాటికి మంత్రులుగా ప్రమాణం చేస్తామని ఆశావహులు ఆశపడ్డారు. చివరికి ఆ పుణ్యకాలం కూడా పూర్తైంది. దీంతో అసలు ఉంటుందా.. ఉండదా అనే అనుమానం మొదలైంది.


మరింత సమాచారం తెలుసుకోండి: