కేంద్ర ప్రభుత్వం... రాజకీయాలతో సంబంధం లేకుండా... దేశంలోని అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపైనే ఉంటుంది. ఇంకా చెప్పాలంటే... పేద రాష్ట్రాలు, వెనుకబడిన రాష్ట్రాల అభివృద్ధి కోసం ప్రత్యేక చేయూత కూడా అందించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపైనే ఉంటుంది. కానీ ప్రస్తుత నరేంద్ర మోదీ సారధ్యంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం... అందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తోంది. తమ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలకు ఒక న్యాయం... అధికారంలో లేని రాష్ట్రాలకు ఒక న్యాయం అన్నట్లుగా మోదీ సర్కార్ వ్యవహరిస్తోంది. ఈ విపక్ష ఇప్పుడు గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మరోసారి బయట పడింది. తొలి నుంచి దక్షిణ భారత దేశంలో పాగా వేయాలనేది భారతీయ జనతా పార్టీ లక్ష్యం. అయితే ప్రాంతీయ పార్టీల హావా కారణంగా బీజేపీ కల నెరవేరలేదు. ఒక్క కర్ణాటక మినహా... మిగిలిన నాలుగు రాష్ట్ట్రాల్లో కూడా కనీస మెజారిటీ సాధించలేకపోయింది. కనీసం స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీజేపీని ఓటర్లు గుర్తించడం లేదు. దీంతో దక్షిణ భారతంపై కేంద్రం పగబట్టినట్లు కనిపిస్తోంది.

రిపబ్లిక్ డే సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించే పరేడ్‌లో అన్ని రాష్ట్రాల శకటాలను ప్రదర్శిస్తారు. దేశానికి స్వాతంత్ర్య వచ్చి 75 ఏళ్లు పూర్తి అవుతున్న సందర్భంగా ఈ ఏడాది వేడుకలను మరింత అద్భుతంగా నిర్వహిస్తున్నారు. ఇందుకోసం స్వాతంత్ర్య స్ఫూర్తికి అద్దం పట్టేలా శకటాలను రూపొందించాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సూచించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు కూడా అందుకు తగినట్లుగానే శకటాలను రూపొందించాయి. ఏపీ ప్రభుత్వం జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్యపై శకటాన్ని రూపొందించిది. దీనిని కూడా ఇప్పుడు కేంద్రం తిరస్కరించింది. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్ట్రాలు తయారు చేసిన శకటాలను కూడా కేంద్రం తిరస్కరించింది. నేతాజీ 125వ జయంతిని పురస్కరించుకుని బెంగాల్ రాష్ట్రం ప్రత్యేక శకటం తయారు చేసింది. అలాగే తమిళనాడుకు రాష్ట్రానికి చెందిన తొలి స్వతంత్ర సమరయోధురాలు వేలునాచయ్యర్‌ స్ఫూర్తితో రూపొందించిన శకటాన్ని నాలుగు సార్లు పరీక్షించిన తర్వాత... తిరస్కరించడంపై ప్రధాని నరేంద్రమోదీకి లేఖ కూడా రాశారు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్. ఎందుకీ వివక్ష అంటూ నిలదీశారు. దీంతో ఇప్పుడు శకటాల గొడవ పెద్ద దుమారం రేపుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: