భాష గొప్ప‌ద‌నం గురించి..ఔన్న‌త్యం గురించి విశిష్ట‌త గురించి..నేనేం రాయ‌ను అవి అంద‌రికీ తెలిసిన‌వి..తెలియాల్సిన వారు మాత్రం గ‌మ్మునుంటున్నారు తెలియ‌జెప్పాల్సిన వారు కూడా బాధ్య‌త లేకుండా ఉంటున్నారు..దేశాన్ని వీడి వెళ్తూ వెళ్తూ.....భాష‌ను వ‌దిలిపోయిన వాళ్లంతా ఇంకా మ‌న‌పై పెత్త‌నం చేస్తూనే ఉన్నారు..వాటి రూపంలో మ‌న పాల‌కుల చేదు నిర్ణ‌యాలు తీపి రోజులు వ‌స్తాయా?


తీయ‌ని తెలుగు భాష‌ను బోధించే ప్ర‌భుత్వ బ‌డులు కాస్త ఇప్పుడు తెలుగు స్థానంలో ఇంగ్లీషు ప‌దాల‌ను వ‌ల్లెవేయించే ప్ర‌య‌త్నాల్లో ఉన్నాయి. జ‌గ‌న్ బాట‌లోనే కేసీఆర్ కూడా ప్ర‌యాణించి స‌ర్కారు బ‌డుల‌కు ఇంగ్లీషు సోకులు అందించ‌నున్నారు. మాతృభాష‌కు ఉన్నంత గొప్ప‌దనం,వైభవం ఆ రోజు ఎంత స్థాయిలో కీర్తించారో మ‌రిచిపోయారా కేసీఆర్ అంటే ఇప్పుడు ఆయ‌న‌కు కోపం వ‌స్తుంది. ఉద్య‌మ భాష‌గా తెలుగు ఉప‌యోగ‌ప‌డిన‌ప్పుడు పాల‌న భాష‌గా తెలుగు ఉప‌యోగ‌ప‌డడం లేదు  ఎందుక‌ని అని అడిగి చూడండి అప్పుడు ఆయ‌న ఏం స‌మాధానం చెబుతారో? ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే విధంగా ఇంగ్లీషు ప్రేమ‌లు పెరిగి పెద్ద‌వి అయి పోతున్నాయి. త‌త్ ఫ‌లితంగా మాతృభాష‌కు ఇక అన్యాయ‌మే! ఉద్యోగ‌, ఉపాధి అవ‌కాశాలు రావాలంటే ఇంగ్లీషు త‌ప్ప‌నిస‌రి అని చెప్పి ప్రాథ‌మిక విద్య‌ను సైతం క‌లుషితం చేయాల‌న్న ఆలోచ‌న‌ను మాత్రం మానుకోవాల‌ని ఇదే స‌మ‌యంలో కొంద‌రు భాషాభిమానులు రెండు తెలుగు రాష్ట్రాల ప్ర‌భుత్వాల‌నూ వేడుకుంటున్నారు. కానీ వీటిని కేసీఆర్ కానీ జ‌గ‌న్ కానీ ప‌ట్టించుకుంటారో లేదో అన్న అనుమానాలు కోకొల్ల‌లుగా ఉన్నాయి.బోధ‌నాంశంగా తెలుగు కాదు బోధ‌న భాష‌గా తెలుగు ఉండాల‌న్న‌ది ఇవాళ్టి భాషాభిమానుల నినాదం.


తెలుగు పాల‌కుల‌కు ఇంగ్లీషు అంటే ప్రేమ వ‌స్తోంది.ప్రేమ పుడుతోంది అని రాయాలి.అవును!ఎన్న‌డూ లేనంత ప్రేమ తెలుగు పాల‌కుల‌కు ఇంగ్లీషుపైనే క‌లుగుతోంది.అందుకు కార‌ణాలు ఏమ‌యినా కానీ ఇప్ప‌టికిప్పుడు ఇంగ్లీషు ప్రేమ‌ను మాత్రం మ‌నం ఆప‌లేం.వ‌ద్ద‌న‌లేం. నిలువ‌రించేందుకు ప్ర‌య‌త్నించ‌లేం కూడా! ఎందుకంటే వాళ్లంతా పిల్ల‌ల అభివృద్ధి వారి భ‌విష్య‌త్తు అంటూ ఏవో పెద్ద‌,పెద్ద ప‌దాలు మాట్లాడి త‌ల్లిదండ్రుల‌ను త‌మవైపు తిప్పుకుంటున్నారు క‌నుక‌! ఆంగ్లంలో క‌న్నా తెలుగులోనే బోధించ‌డం వ‌ల్ల సులువుగా పిల్ల‌ల‌కు అన్ని విష‌యాలూ అర్థం అవుతాయి అని ఎన్నో ఏళ్ల నుంచి ప‌రిశోధ‌న‌లు చెబుతున్నా మాతృభాష ఔన్న‌త్యం గురించి ఆయా నివేదిక‌లు గొప్ప‌గా వెల్ల‌డిస్తున్నా మ‌న పాల‌కుల‌కు మాత్రం ఇంగ్లీషు ప్రేమ ఇప్ప‌ట్లో పోయేలా లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి:

trs