ఎప్పుడూ వార్త‌ల్లో ఉండే రాజ‌కీయ కురు వృద్ధుడు జేసీ దివాక‌ర్ రెడ్డి మ‌ళ్లీ ర‌చ్చ చేశారు.భాగ్య‌న‌గ‌రిలో సీఎం ఇంటికి పోయి నానా హ‌డావుడి చేసేందుకు ట్రై చేశారు. అప్ర‌మ‌త్త‌మ‌యిన పోలీసులు అరెస్టు చేసి తీరిగ్గా విష‌యం ఏంట‌న్న‌ది ఆరా తీస్తున్నారు.ఆ వివ‌రం ఈ క‌థ‌నంలో!


ఇవాళ ప్ర‌గ‌తి భ‌వ‌న్ ద‌గ్గ‌ర సీమ రెడ్డి జేసీ దివాక‌ర్ రెడ్డి హ‌ల్ చ‌ల్ చేయ‌డంతో మ‌ళ్లీ వార్తా ఛానెళ్లు హోరెత్తిపోయాయి. అస‌లు ముంద‌స్తు అనుమ‌తి లేనిదే సీఎంను ఎలా క‌ల‌వ‌నిస్తామ‌ని పోలీసులు ఆయ‌న‌ను ప్ర‌శ్నించారు. దీంతో అక్క‌డ వాగ్వాదం నెల‌కొంది.కేసీఆర్ ను కానీ కేటీఆర్ ను కానీ క‌ల‌వాలంటే అనుమ‌తి త‌ప్ప‌ని స‌రి అని ప‌దే ప‌దే చెప్పి చూశారు కానీ జేసీ  అర్థం చేసుకోలేదు.దీంతో చేసేది లేక ఆయ‌న‌ను అరెస్టు చేసి పంజాగుట్ట పోలీసు స్టేష‌న్ కు త‌ర‌లించారు. కాగా ఇప్పుడెందుకు ఆయ‌న ఇక్క‌డికి వ‌చ్చార‌ని?



గ‌త కొద్దికాలంగా టీడీపీలో కూడా రాజ‌కీయ ఉనికి లేని నాయ‌కుడిగా జేసీ ఉన్నారు.వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు మిన‌హా ఆయ‌న పెద్ద‌గా సాధించిందేమీ లేదు.జ‌గ‌న్ ను ఢీకొనే స‌త్తా కూడా ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో లేదు. ఏవో మొన్న మున్సిప‌ల్ ఎన్నిక‌ల సంద‌ర్భంగా కాస్తో కూస్తో ప‌ట్టు తెచ్చుకుంటే తెచ్చుకోవ‌చ్చు.అది కూడా తాడిప‌త్రి నియోజ‌క‌వ‌ర్గం వ‌ర‌కే! అయినా కూడా మీసాలు మెలేయ్య‌డాలు, స‌వాళ్లు విసిరి త‌రువాత చ‌ర్చ‌కు ర‌మ్మ‌ని పిల‌వడాలు అన్నవి ఎప్పుడూ ఉండేవే! ఏదేమ‌యినా కేసీఆర్ తో స్నేహం కోసం ఎందుక‌నో గ‌త కొంత‌కాలంగా వెంప‌ర్లాడుతున్నారాయ‌న‌.



ఇందులో భాగంగా రాయ‌ల తెలంగాణ అంశాన్ని తెర‌పైకి తెచ్చి,రాజ‌కీయ ల‌బ్ధి పొందాల‌ని చూస్తున్నారాయ‌న.అందుక‌నో, ఎందుక‌నో ఇవాళ ఆయ‌న ప్ర‌గ‌తి భ‌వ‌న్ (టీ సీఎం అధికార నివాసం)కు వ‌చ్చి ఉన్నార‌ని అర్థం చేసుకోవాలి లేదా ఏదో ఒక సెన్సేష‌న్ కోసం ఇటుగా వ‌చ్చి వెళ్లి ఉండాలి.అంత‌కుమించి ఆ వార్త‌లో కానీ ఆయ‌న రాక‌లో కానీ ఎటువంటి విశేషం ఉండి ఉండ‌దు కూడా!



మరింత సమాచారం తెలుసుకోండి:

trs