అర్థవంతం అయిన రాత్రి ఉందా అని ప్రశ్నిస్తాడు పూరీ.. డైరెక్టర్ పూరీ తనదైన శైలిలో! ఈ ప్రశ్నకు ముందున్న ప్రశ్న ఎలా ఉందో కూడా ఊహించాలి.. రాత్రి అర్థవంతం అయితే రోజు అర్థవంతం అని రాయడం కూడా ఆయనకే చెల్లు.. రాయడం మరియు పలకడం ఇలాంటి అర్థాలతోనే పలకడం ఆయనకు మాత్రమే చెల్లు.. మరి!వైవాహిక బంధాల్లో ప్రేమ చెల్లుచీటి అయిపోయిందా..చించి అవతల విసిరేశాక ఆ అత్తరు కాగితం విలువ తెలియకుండానే పోతోంది..ప్రేమ అత్తరు పూసిన దేహాలకు మాత్రం అర్థం అయి ఉందా? లేదా అత్తరు పూసిన కాగితాల చెంత  ఉన్న అక్షరాల్లో కవిత్వీకరణ ధోరణుల్లో ఆగిపోయిందా?


విడిపోవడం అంగీకారార్థం కలిసి ఉండడం కలహార్థం అని చెప్పిన ధనుష్ కానీ ఐష్ కానీ ఆ బిడ్డలకు జీవితాలకు ఓ అర్థం చెప్పి వెళ్తే ఎంత మేలు.. అప్పుడు శత్రువు ఎవరు అవుతారు? జన్మనిచ్చిన పాపానికి తల్లిదండ్రులే శత్రువులు బిడ్డలు ఆ పాపాన్ని కడదాకా మోసేందుకు సిద్ధం కావాల్సిందే అన్నది ఓ చేయక తప్పని పని!


నిర్జీవం అయి ఉండి ఉంటే ప్రేమ కానీ పెళ్లి కానీ పెద్దగా పట్టింపులో ఉండవు.నిర్జీవం అయ్యేంతవరకూ ప్రేమ కానీ పెళ్లి కానీ తోడుండే బంధాలుగా ఉండాలని అనుకోవడం పెద్ద తప్పు.పెళ్లి మాత్రమే విస్పష్టం అయిన సంకేతాలు ఇచ్చిన రోజులివి. ప్రేమతో మాత్రమే మనుషులు తమని తాము అర్థం చేసుకుని జీవించలేని రోజులివి.కనుక ఇద్దరు విడిపోవడంలో కారణం ఏదో ఒకటి ఉంటుంది.. తెరపైకి వచ్చిన ప్రతిసారీ మనిషి మూలాలు చెడిపోయి ఉంటాయి..లేదా సంస్కరణలో లేనివి అయి ఉంటాయి.. కారణాన్ని మనిషి ద్వేషించడం మొదలు పెడితే పరిణామ గతికి అర్థమే లేదు. కనుక ప్రేమ కారణం అయితే పెళ్లి ఫలితం అయిందా హా హా మీరే చెప్పాలి ధనుష్..మీరే చెప్పాలి ఐశ్వర్య రజనీ కాంత్.....


జీవితంలో ప్రేమ ప్రమాదమా పెళ్లి ప్రమాదమా అన్న వివరాలు దగ్గర ఆగిపోవాలి.ప్రేమ ప్రమాదం అయితే కావొచ్చు.మనం ఆపలేం. మనం వద్దనలేం కూడా! జీవితంలో పెళ్లి కూడా ఓ రకం అయిన ప్రమాదమే అయి ఉండాలి.కనుక మనం దేనిని వద్దనుకోవాలి దేనిని ఆహ్వానించాలి అన్నవి అంత వేగంగా తేల్చుకోలేకపోతున్నాం. జీవితంలో పెళ్లిళ్లు అన్నవి అన్నీ కూడా మనుషులను బంధీలుగా మార్చేవే అని అంటారు కొందరు.అవును! అన్ని బంధాలకు కారణం అయిన పెళ్లి కొన్ని సార్లు మాత్రం అతి పెద్ద అవరోధం అయి ఉంటుంది అని చెప్పడంలో వాస్తవం ఉంది.అన్ని బంధాలకు మూలం అయిన పెళ్లి కొన్నిసార్లు జీవిత కాల విషాదాలను మోసుకు వెళ్తుంది. ప్రేమ సులువు పెళ్లి కష్టం అని చెప్పడంలో ఉన్న అంతరార్థం ఇదే! ప్రేమించే వరకూ ప్రేమ బాగుంటే ప్రేమను వదిలేశాక జీవితం ఒక వింత వస్తువులా ఉంటుంది. కనుక ప్రేమ  ప్రమాదకారి ..పెళ్లి కొన్నింట వినాశనకారి కూడా! బిడ్డలు ఏమయి పోతున్నారో కూడా తెలియని విషాదం ఒకటి పెళ్లితోనే సాధ్యం..తరాల మధ్య దూరం పెళ్లి తగ్గించదు ప్రేమ తగ్గిస్తుంది..తరాల ఉత్పత్తికి కారణం ప్రేమతో పాటు ఇంకొన్ని జీవ చర్యలు కూడా!

- రత్నకిశోర్ శంభుమహంతి


మరింత సమాచారం తెలుసుకోండి: