దేశంలోని అన్ని రాష్ట్రాల ఎన్నికలు ఒకవైపు... ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఒకవైపు అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. ఇందుకు ప్రధాన కారణంగా దేశంలోనే అతి పెద్ద రాష్ట్రమైన యూపీ అసెంబ్లీలో అధికారంలో ఉన్న పార్టీనే జాతీయ స్థాయిలో చక్రం తిప్పుతుందని కూడా అన్ని పార్టీ నమ్మకం. ఇదే విషయం ఇప్పటికే పలుమార్లు రుజువైంది కూడా. దీంతో అన్ని ప్రధాన పార్టీలు కూడా యూపీ ఎన్నికలపై ప్రత్యేక ఫోకస్ పెట్టాయి. మరో రెండున్నర ఏళ్లలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న పరిస్థితుల్లో యూపీ ఎన్నికలను సెమీ ఫైనల్ పోరుగా అభివర్ణిస్తున్నారు కూడా. అందుకే ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ఇప్పటికే సమాజ్ వాదీ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు తమ శాయశక్తులా ప్రయత్నం చేస్తున్నాయి. అయితే ప్రస్తుతం యూపీ ఎన్నికలు జరుగుతున్న 403 నియోజకవర్గాలు ఒకఎత్తు అయితే... ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యానాథ్ పోటీ చేస్తున్న గోరఖ్ పూర్ నియోజకవర్గం ఒకఎత్తు అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది.

గతంలో లోక్‌సభకు వరుసగా ఎన్నికవుతున్న యోగీ ఆదిత్యానాథ్ అనూహ్యంగా తొలిసారి యూపీ అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2017 ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడంతో... ఎంపీగా వ్యవహరిస్తున్న యోగీ ఆదిత్యానాథ్‌ను ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టారు బీజేపీ అగ్రనేతలు. ఆ తర్వాత తన ఎంపీ పదవికి రాజీనామా చేసిన యోగీ... మండలి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పుడు తొలిసారి గోరఖ్‌పూర్ నుంచి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న ఫైర్‌బ్రాండ్ బీజేపీ నేత, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆ పార్టీ కంచుకోట నుంచి సునాయాసంగా విజయం సాధించనున్నట్లు సర్వే నివేదికలు వెల్లడిస్తున్నాయి. గతంలో 1971లో ఓడిపోయిన త్రిభువన్ నారాయణ్ సింగ్ తర్వాత జిల్లా నుంచి ముఖ్యమంత్రిగా పోటీ చేసిన రెండో నాయకుడు యోగీ ఆదిత్యనాథ్. ఉత్తరప్రదేశ్‌లోని పూర్వాంచల్ ప్రాంతంలో ఉన్న గోరఖ్‌పూర్ చాలా కాలంగా బీజేపీకి కంచుకోటగా ఉంది. 1998 నుంచి గోరఖ్‌పూర్ నుంచి యోగీ ఆదిత్యానాఖ్ వరుసగా ఐదు సార్లు ఎంపీగా గెలుపొందారు. పూర్వాంచల్ ప్రాంతమైన గోరఖ్‌పూర్ నియోజకవర్గం 2007 నుంచి యూపీ ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తోంది. ఇక్కడ నుంచి బీజేపీ అభ్యర్థులు సునాయాసంగా గెలుస్తూనే ఉన్నారు. దీంతో యోగీ మరోసారి గోరఖ్‌రపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సునాయాసంగా గెలుపొందనున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: