భారత్ - చైనా మధ్య సరిహద్దు వివాదం ఇప్పట్లో చల్లారేలా కనిపించటం లేదు. ఇప్పటికే సరిహద్దుల విషయంలో భారత్‌తో నిత్యం వివాదాలు పెట్టుకుంటూనే ఉంది చైనా. అటు డోక్లామ్ మొదలు... అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం వరకు అంతా తమదే అన్నట్లుగా చైనా ఎన్నోసార్లు వాదన పెట్టుకుంది. చివరికి దేశ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అరుణాచల్ ప్రదేశ్ పర్యటనపై కూడా అభ్యంతరాలు వ్యక్తం చేసింది. అనుమతి లేకుండా తమ దేశ భూభాగంలో ఎలా పర్యటిస్తారంటూ భారత విదేశాంగ శాఖ మంత్రిత్వ శాఖకు లేఖ కూడా రాసింది చైనా. దీనికి భారత్ కూడా ధీటుగానే జవాబు ఇచ్చింది. అయినా సరే... అటు ఉత్తరాఖండ్, ఇటు అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దుల్లో కొత్త గ్రామాలను కూడా నిర్మిస్తోంది. ఇప్పుడు తాజాగా చైనా ఆర్మీ మరో దుస్సాహసానికి ఒడిగట్టింది కూడా. అరుణాచల్ ప్రదేశ్‌పై పెత్తనం కోసం ఆరాటపడుతున్న చైనా... ఇప్పుడు అక్కడ మరో దుశ్చర్యకు పాల్పడింది.

సరిహద్దులపై పెత్తనం చేసేందుకు తొలి నుంచి ఆక్రమణలకు పాల్పడుతున్న చైనా ఆర్మీ బలగాలు... ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన ఓ 17 ఏళ్ల యువకుడిని ఎత్తుకెళ్లాయి. అరుణాచల్ ప్రదేశ్‌లోని ఎగువ సియాంగ్ జిల్లాకు చెందిన యువకుడిని చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ... పీఎల్‌ఏ అపహరించినట్లు ఆ రాష్ట్ర ఎంపీ తపిర్ గావో తాజాగా ట్వీట్‌లో వెల్లడించారు. మిరామ్ టారోన్ అనే యువకుడిని చైనా ఆర్మీ బలగాలు సియుంగ్లా ప్రాంతంలోని లుంగ్టా జోర్ ప్రాంతం నుంచి కిడ్నాప్ చేసినట్లు ఎంపీ తపిర్ గావో వెల్లడించారు. కిడ్నాప్ జరిగిన బిషింగ్ గ్రామం పూర్తిగా భారత భూభాగంలోనే ఉంది. అయితే ఈ ప్రాంతంలో 2018లోనే 4 కిలోమీటర్ల దూరం రహదారిని భారత భూభాగంలో చైనా నిర్మించింది. ఇప్పుడు అదే ప్రాంతం నుంచి మిరామ్ టారోన్‌ను పీఎల్ఏ బలగాలు అపహరించాయి. మిరామ్ టారోన్‌ను చైనా బంధిఖానా నుంచి త్వరగా విడిపించేందుకు దేశంలోని అన్ని ఏజెన్సీలు తీవ్రంగా కృష్టి చేయాలని ఎంపీ తపిర్ గావో విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు ఈ వ్యవహారం భారత్, చైనాల మధ్య మరోసారి ఉద్రిక్తతలకు దారి తీస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: