ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో తమకు అధికారం ఇవ్వాలంటున్నారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ, జనసేన పార్టీలు కలిసి పోటీ చేస్తాయని క్లారిటీ ఇచ్చేశారు కూడా. అదే సమయంలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు కూడా చేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తోందని ఘాటు విమర్శలు చేశారు సోము వీర్రాజు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రాష్ట్ర ప్రజలు సంతోషంగా లేరని ఆగ్రహం వ్యక్తం చేశఆరు సోము వీర్రాజు. ప్రజలకు మెరుగైన పరిపాలన అందించడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కూడా విమర్శించారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వైసీపీ మాత్రం తన పథకాలుగా గొప్పలు చెప్పుకుంటోదని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఫోటోలు వేయడం సరికాదని దుయ్యబట్టారు. ప్రజల సమస్యలు తీర్చాల్సిన ముఖ్యమంత్రి ఫోటోలకు ఫోజులు ఇస్తున్నారని ఆరోపించారు సోము వీర్రాజు.


తమ సమస్యలు తీర్చాలని ప్రశ్నిస్తున్న ప్రజలపైనే ప్రస్తుత ప్రభుత్వం దాడులు చేస్తోందని ఆరోపించారు. అదే సమయంలో జనంపైనే తిరిగి కేసులు పెడుతున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ప్రస్తుతం అభివృద్ధి అనే మాటే లేదని ఆరోపించారు సోము వీర్రాజు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగేలేదన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే... రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామన్నారు. రాష్ట్రానికి అమరావతి మాత్రమే రాజధాని అని సోము వీర్రాజు మరోసారి స్పష్టం చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతి నిర్మాణాన్ని తిరిగి ప్రారంభిస్తామన్నారు. గతంలో టీడీపీ హయాంలో ఐదేళ్ల పాటు అమరావతి పేరుతో ప్రజలను చంద్రబాబు మోసం చేశారని ఆరోపించారు. ఇప్పుడు వైఎస్ జగన్ కూడా మూడు రాజధానుల పేరుతో కాలయాపన చేస్తున్నారు తప్ప... ఎలాంటి పనులు చేయటం లేదన్నారు. మూడేళ్లలోనే అమరావతి నిర్మాణం పూర్తి చేసి చూపిస్తామని సోము వీర్రాజు హామీ ఇచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: