ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా వైరస్ కేసులు పది వేలు దాటేశాయి. కానీ వాటి కంటే కూడా... ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాల వ్యవహారమే ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారిపోయింది. ఉద్యోగుల పీఆర్‌సీ వ్యవహారం ఏపీలో రోజురోజుకూ మరింత ముదురుతోంది. పీఆర్‌సీ అమలు జరిగితే జీతాలు పెరుగుతాయని ఉద్యోగులు భావించారు. కానీ ప్రభుత్వం విడుదల చేసిన జీవోల కారణంగా తమ వేతన్నాల్లో కోత పడుతుందని తెలిసి అందోళన బాట పట్టారు ఉద్యోగులు. అదే సమయంలో ప్రభుత్వ జీవోలపై హైకోర్టును కూడా ఆశ్రయించారు ఉద్యోగులు. ఇక ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పోరు బాట పట్టారు. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని కలెక్టరేట్‌లను ఉపాధ్యాయులు ముట్టడించారు. రేపు ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇప్పటికే కార్యాచరణ ప్రకటించారు కూడా. ఇప్పటికే రోడ్లపైకి వచ్చి వివిధ రూపాల్లో నిరసనలు తెలుపుతున్న ఉద్యోగులు.. ప్రభుత్వంతో తాడోపేడో తెల్చుకునేందుకు సిద్దమవుతున్నారు.

మరోవైపు ఉద్యోగుల పోరుపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు కూడా ఎదురుదాడి ప్రారంభించారు. పీఆర్‌సీ ప్రకటించిన సమయంలో ఉద్యోగులు అన్ని విషయాలకు ఒప్పుకున్నారని మంత్రులు వెల్లడించారు. అయితే ఇప్పుడు పోరాటాలు చేయడం ఏమిటని మంత్రులు బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్ ప్రశ్నిస్తున్నారు. పీఆర్‌సీ అమలు కోసం జారీ చేసిన జీవోలను సవాల్ చేస్తూ ఏపీ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కే.వీ.కృష్ణయ్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విభజన చట్టం ప్రకారం ఉద్యోగుల వేతనాలు తగ్గేందుకు ఎలాంటి అవకాశం లేదన్నారు. కానీ పీఆర్‌సీ ప్రకటించిన ప్రభుత్వం మాత్రం... అన్ని స్థాయిల్లోని ఉద్యోగుల వేతనాల్లో కోత పడేలా చేస్తోందన్నారు. ఉద్యోగుల ప్రయోజనాలకు రక్షణ కల్పిస్తామని విభజన చట్టంలో స్పష్టంగా ఉందన్నారు. కానీ అందుకు విరుద్ధంగా ప్రభుత్వం జీవోలు ఇచ్చిందన్నారు. హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో ఏపీ ప్రభుత్వం తరపున సీఎస్, ఆర్ధిక శాఖ అధికారులు, రెవెన్యూశాఖ, కేంద్ర హోమ్ శాఖలను ప్రతివాదులుగా చేర్చామని కేవీ కృష్ణయ్య వెల్లడించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: