తెలుగుదేశం పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు జేసీ దివాక‌ర్‌రెడ్డి బుధ‌వారం హైదరాబాద్‌లోని టీఆర్ఎస్ ప్ర‌ధాన కార్యాల‌యం ప్ర‌గ‌తిభ‌వ‌న్‌కు రావ‌డం, అక్క‌డ
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ను క‌లుసుకునేందుకు ప్ర‌య‌త్నించ‌డం, అయితే ఆయ‌న ముందుగా అనుమ‌తి తీసుకోకుండా రావ‌డంతో అక్క‌డ సెక్యూరిటీ అధికారులు జేసీని లోప‌ల‌కు అనుమ‌తించ‌క‌పోవ‌డం తెలిసిందే. చివ‌ర‌కు మంత్రి కేటీఆర్‌ను అయినా క‌లిసి వెళ‌తాన‌ని అడిగినా ఆయ‌న‌ను అనుమ‌తించ‌క‌పోవడంతో నిరాశ‌గా ఆయ‌న తిరిగి వెళ్లిపోయారు. గ‌త అసెంబ్లీ స‌మావేశాల సంద‌ర్భంగా ఒక‌సారి జేసీ దివాక‌ర్‌రెడ్డి కేసీఆర్‌తో స‌మావేశ‌మయ్యారు. మ‌రోసారి ఆయ‌న ఎందుకు కేసీఆర్‌ను క‌ల‌వాల‌నుకున్నార‌నే అంశంపై భిన్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి. జేసీ దివాకర్‌రెడ్డి ప్ర‌స్తుతం అధికారిక ప‌ద‌వుల్లో లేక‌పోయుండొచ్చుగాక‌. కానీ తెలుగుదేశం పార్టీకంటే ముందు ఆయ‌న‌ కాంగ్రెస్ పార్టీ నేత‌గా మూడు ద‌శాబ్దాల‌కు పైగా ఉన్నారు. ఉమ్మ‌డి రాష్ట్రంలో మంత్రి ప‌ద‌వులు నిర్వ‌హించారు. సీఎం కేసీఆర్ బిజీగా ఉన్నా కేటీఆర్ అయినా జేసీని స‌గౌర‌వంగా లోప‌లికి పిలిపించి మాటామంతీ జ‌రిపి పంపించి ఉండొచ్చు. కానీ అలా ఎందుకు జ‌ర‌గ‌లేదు..? ఏపీలో త‌న కుటుంబానికి వైసీపీ ప్ర‌భుత్వానికి మ‌ధ్య‌న ఉన్న పంచాయితీల‌ను తెలంగాణ సీఎం కేసీఆర్ ద్వారా ప‌రిష్క‌రించుకునేందుకు జేసీ ప్ర‌య‌త్నిస్తున్నందునే ఆయ‌నను వారు క‌ల‌వ‌లేద‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి.

గ‌తంలో టీడీపీ హ‌యాంలో జ‌రిగిన కొన్ని సంఘ‌ట‌న‌ల నేప‌థ్యంలో జేసీ దివాక‌ర్‌రెడ్డి కుటుంబంపై ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి ఆగ్ర‌హంగా ఉన్నారు. నిజానికి జేసీ, వైఎస్ కుటుంబాల‌కు మొద‌టినుంచీ కాంగ్రెస్ పార్టీలో పడేది కాదు. అయితే వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి ముఖ్య‌మంత్రి అయ్యాక జేసీ వైఎస్ఆర్‌ల మ‌ధ్య స‌ఖ్య‌త కుదర‌డంతో వ్య‌వ‌హారం సాఫీగానే సాగిపోయింది. ఆ త‌రువాత కాలంలో ప్ర‌త్యేక తెలంగాణ ఉద్య‌మ కాలంలో రాయ‌ల తెలంగాణ అంశాన్ని బ‌లంగా వినిపించిన నేత‌గా జేసీకి పేరుంది. చివ‌ర‌కు రాష్ట్ర విభ‌జ‌న జ‌ర‌గ‌డంతో జేసీ కుటుంబం టీడీపీలో చేరింది. ఆ కాలంలో వైఎస్ కుటుంబంపై జేసీ బ్ర‌ద‌ర్స్ శృతిమించి వ్యాఖ్య‌లు చేశార‌న్న విమ‌ర్శ‌లున్నాయి. ఈ నేప‌థ్యంలోనే జ‌గ‌న్ సీఎం అయ్యాక జేసీ కుటుంబం వ్యాపారాల‌పై అధికారులతో దాడులు చేసి మూయించారు. వారికి చెందిన ట్రావెల్స్ వ్యాపారం ఇబ్బందుల్లో ప‌డింది. దీంతో జేసీ కుటుంబం అన్నివిధాలుగాను ఉక్కిరిబిక్కిర‌వుతోంది. జేసీ కుటుంబానికి తెలంగాణ‌లో బంధుత్వాలున్నాయి. హైద‌రాబాద్‌లోనూ వ్యాపారాలు, ఆస్తులు ఉన్నాయి. ఈ నేప‌థ్యంలోనే కేసీఆర్ తో స‌ఖ్య‌త‌ను పాటించ‌డంతోపాటు ఆయ‌న ద్వారా ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డిపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు జేసీ దివాక‌ర్‌రెడ్డి ప్ర‌య‌త్నాలు సాగిస్తున్నార‌ని తెలుస్తోంది. అయితే చాలాసార్లు ముక్కుసూటిగా కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ట్టు మాట్లాడే జేసీ విష‌యంలో తాను క‌ల‌గ‌జేసుకుంటే అన‌వ‌స‌ర‌మైన ఇబ్బందులు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని తెలంగాణ సీఎం భావిస్తున్న‌ట్లు స‌మాచారం. ప్ర‌త్య‌ర్థుల విమ‌ర్శ‌లకు చేజేతులా అవ‌కాశం ఇచ్చిన‌ట్టవుతుంద‌ని భావించిన కేసీఆర్  ఆయ‌న‌ను క‌లిసేందుకు ఇష్ట‌ప‌డ‌లేద‌ట‌. ఉమ్మ‌డి రాష్ట్రంలో రాజ‌కీయంగా ఒక‌వెలుగు వెలిగిన జేసీ దివాక‌ర్‌రెడ్డి ప్ర‌స్తుత ప‌రిస్థితి చూస్తే ఓడ‌లు బ‌ళ్లు, బ‌ళ్లు ఓడ‌లైన సామెత గుర్తుకు వ‌స్తోంది క‌దూ..!

మరింత సమాచారం తెలుసుకోండి: