కరోనా వ్యాప్తి కారణంగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి ఇంటింటి ఫీవర్ సర్వే నిర్వహించాలని నిర్ణయించింది. మరోవైపు అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో కోవిడ్ చికిత్సకు అవసరమైన ఆక్సిజన్ నిల్వలను 350మెట్రిక్ టన్నులకు పెంచుకున్నట్టు మంత్రి హరీశ్ రావు తెలిపారు. ఎలాంటి లక్షణాలున్నా.. ఏఎన్ఎం సెంటర్లకు గానీ.. బస్తీ దవాఖానాలకు గానీ వెళ్తే హోం ఐసోలేషన్ కిట్లు అందజేస్తామని మంత్రి పేర్కొన్నారు.

ఇక కరోనా మహమ్మారి ఉధృతి కారణంగా రాష్ట్రంలో కోవిడ్ ఆంక్షలు ఈ నెల 31వరకు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ర్యాలీలు, బహిరంగ సభలు, మతపరమైన వాటితో పాటు.. రాజకీయ, సాంస్కృతిక కార్యక్రమాలపై నిషేధం అమల్లో ఉంటుందని పేర్కొంది. ప్రజా రవాణా, దుకాణాలు, మాల్స్, వ్యాపార సంస్థలు, కార్యాలయాల్లో ప్రతీ ఒక్కరూ విధిగా మాస్క్ ధరించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.

ముఖ్యంగా గ్రామాల్లో కరోనా పంజా విసురుతోంది. జీహెచ్ఎంసీతో పాటు మరో 14జిల్లాల్లో వైరస్ తీవ్రంగా వ్యాప్తి చెందుతోంది. మేడ్చల్, మల్కాజ్ గిరి, రంగారెడ్డి, హనుమకొండ, సంగారెడ్డి, ఖమ్మం, మంచిర్యాల, కరీంనగర్, భద్రాద్రి, పెద్దపల్లి, మహబూబ్ నగర్, సిద్ధిపేట, నిజామాబాద్, యాదాద్రి, వికారాబాద్ జిల్లాల్లో కేసులు భారీగా పెరుగుతున్నాయి. రాకపోకలు యథేచ్చగా కొనసాగడం, పండగలు, శుభకార్యాలు, రాజకీయ కార్యక్రమాలే వైరస్ వ్యాప్తికి కారణమవుతున్నాయి.

ఇక ఫిబ్రవరి 16 నుండి 19 మధ్య జరిగే సమ్మక్క-సారలమ్మ జాతరకు 75కోట్ల రూపాయలతో అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. భక్తులంతా మాస్కులు ధరించి జాతరకు రావాలన్నారు. ప్రభుత్వం తరఫున భక్తులకు మాస్కులు పంపిణీ చేస్తామన్నారు. అరగంటలోనే దర్శనం పూర్తయ్యేలా ప్రణాళికలు అమలు చేస్తున్నట్టు తెలిపారు. 8వేలకు పైగా ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేస్తున్నామన్నారు. 


మొత్తానికి కరోనా వైరస్ ను అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. అందుకే ఇంటింటి ఫీవర్ సర్వే చేపట్టాలని నిర్ణయించింది. అలా బాధితులను గుర్తించి వారి హోం ఐసోలేషన్ కిట్ లు అందించేలా ప్లాన్ చేస్తోంది.




మరింత సమాచారం తెలుసుకోండి: