దేశంలో గతంలో ఎన్నడూ లేనటువంటి పరిస్థితులు ప్రస్తుతం నెలకొని ఉన్నాయి. వాస్తవానికి ప్రతి సారి కూడా సరిగ్గా ఎన్నికలకు ఏడాది ముందు నుంచి మాత్రమే రాజకీయాల గురించి ప్రస్తావన వస్తుంది. అలాగే ఎలక్షన్ ఇయర్ ప్రారంభమైన నాటి నుంచి మాత్రమే ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లు ప్రచారంలో ఉంటాయి. అదే సమయంలో ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది... ఏ పార్టీ ఓడుతుంది అనే విషయంపై కూడా ఎన్నికల ఏడాదిలోనే చర్చ జరుగుతుంది. మిగిలిన నాలుగేళ్లు కూడా ప్రభుత్వంపై విమర్శలు, ధర్నాలు, ఆందోళనలు, నిరసనలతోనే ప్రతిపక్షాలు సరిపెడతాయి. అటు ప్రభుత్వాలు కూడా నాలుగేళ్ల పాటు సంక్షేమ పథకాల అమలుపైనే ప్రధానంగా దృష్టి పెడతాయి. కానీ ప్రస్తుతం మాత్రం పరిస్థితి పూర్తి విరుద్ధంగా మారిపోయింది. వాస్తవానికి దేశంలో సార్వత్రిక ఎన్నికలకు ఇంకా రెండున్నర ఏళ్లు సమయం ఉంది. ప్రస్తుతం ప్రధాన మంత్రి మోదీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సరిగ్గా రెండున్నర ఏళ్లు పూర్తి చేసుకుంది. అయినా సరే.. ఇప్పటి నుంచే ఎన్నికల గురించి దేశ వ్యాప్తంగా జోరుగా చర్చ నడుస్తోంది.

ప్రస్తుతం సర్వత్రా ఒకటే అంశంపై చర్చ. ఇప్పటికిప్పుడు సార్వత్రిక ఎన్నికలు జరిగితే ఏ పార్టీ గెలుస్తుంది. ప్రజలు ఏ పార్టీకి ఓట్లు వేస్తారు. ఎవరి నాయకత్వానికి మద్దతు ఇస్తారు. ఎన్‌డీయే ప్రభుత్వం హ్యాట్రిక్ కొడుతుందా... కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందా.. ఇవే ప్రశ్నలు... ఈ ప్రశ్నలకు ఇప్పుడు ఇండియా టుడే సంస్థ నిర్వహించిన మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే జవాబు ఇస్తోంది. వాస్తవానికి ఐదు రాష్ట్రాల ఎన్నికల కోసం సర్వే చేసిన ఇండియా టుడే సంస్థ పనిలో పనిగా... సాధారణ ఎన్నికలపై కూడా సర్వే చేసింది. ఇప్పటికిప్పుడు దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరిగితే.. ఎన్‌డీయే ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వస్తుందని సర్వేలో తేల్చేసింది. మొత్తం 543 స్థానాలున్న లోక్‌సభకు ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు నిర్వ‌హిస్తే బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీయే 296 స్థానాల్లో విజ‌యం సాధిస్తుంద‌ని తేలింది. అదే సమయంలో కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ కూడా తమ బలాన్ని పెంచుకుంటుందని తేలింది. యూపీఏ  127 స్థానాలో స‌రిపెట్టుకుంటుంద‌ని స్పష్టం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: