నిన్న మొన్నటి వరకూ సాక్షి పత్రికలో ఉద్యోగులు, పీఆర్సీ విషయంలో కథనాలు వారికి వ్యతిరేకంగా ఉండేవి. కష్టకాలంలో ఉద్యోగులు ప్రభుత్వం మాట వినడంలేదనే విషయాన్ని ఎక్కువగా హైలెట్ చేసేవారు. అదే సమయంలో సామాన్యులు అడుగుతున్నట్టుగా.. ప్రభుత్వ ఉద్యోగులకు అంతంత జీతాలెందుకనే ప్రస్తావన కూడా వచ్చేది. ఇటీవల సచివాలయ ఉద్యోగుల నిరసనల సమయంలో కూడా సాక్షి పంథా ఇలాగే ఉంది. ఆ తర్వాత ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ విషయంలో నిరసనలను లైట్ తీసుకోవడం, ప్రభుత్వానికి వత్తాసుగా, ఉద్యోగులకు వ్యతిరేకంగా వార్తలు రావడంతో ఉద్యోగ సంఘాల నాయకులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు సాక్షి పత్రికల్ని అడ్డుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారనే ప్రచారం జరిగింది. దీంతో సాక్షి పంథా మారింది. కలెక్టరేట్ల వద్ద ఉద్యోగ సంఘాలు చేపట్టిన నిరసనలకు కూడా మొదటి పేజీలో ప్రాధాన్యం దక్కింది.

ఉద్యోగులంతా సాక్షికి వ్యతిరేకంగా ఉన్నారనే ప్రచారం ఇటీవల ఎక్కువగా జరిగింది. ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే సాక్షి పత్రికకు కొన్నిసందర్భాల్లో ఉద్యోగులే చందా చెల్లిస్తుంటారు. అలాగే ఉన్నతోద్యోగుల కార్యాలయాలకు కూడా సాక్షి తప్పనిసరి. కానీ సాక్షిలో మాత్రం ఉద్యోగులకు పాజిటివ్ గా వార్తలు ఇటీవల లేకపోవడంతో వారంతా ఆగ్రహంతో ఉన్నారు. తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారనే భావన కూడా వారిలో కలిగింది. దీంతో సాక్షిని ఉద్యోగులు బ్యాన్ చేయబోతున్నారనే లీకులు కూడా బయటకు వదిలారు. అంతలోనే పేపర్ స్టైల్ మారింది. కలెక్టరేట్ల ముట్టడిని ఉద్యోగులు ఊహించని స్థాయిలో కవర్ చేశారు. రెండో పేజీలో మూడో మూలన పడేయకుండా ఫ్రంట్ పేజీలో కవర్ చేశారు.

ప్రభుత్వ అనుబంధ పత్రికే అయినా.. ఉద్యోగుల సమస్యలను హైలెట్ చేయకుండా కవర్ చేయాలనుకోవడం తప్పు. అదే సమయంలో ప్రజల్లోనూ, ప్రభుత్వ ఉద్యోగుల్లోనూ వ్యతిరేకత వస్తే దాన్ని తట్టుకోవడం కష్టం. ఒకవేళ జగన్ ని వ్యతిరేకించాలంటే మరో రెండేళ్లు ఆగాలేమో కానీ, సాక్షిని ఆపేయాలంటే మాత్రం ఒక్క ఫోన్ కాల్ పని. అందుకే ఉద్యోగుల్లో వస్తున్న వ్యతిరేకతను ముందే గమనించి తప్పు సరిదిద్దుకున్నారు. ఈ మార్పు మంచిదే. అదే సమయంలో ప్రభుత్వం కూడా ఉద్యోగుల కష్టాలను ఆలకిస్తుందా, లేక ఆర్థిక కష్టాల పేరు చెప్పి సర్దుకోవాలని ఘంటాపథంగా చెబుతుందా అనేది తేలాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: