ఏపీలో పీఆర్సీ పీటముడి ఇంకా వీడలేదు. అసలే కరోనా కష్టకాలంలో ఉన్నాం.. ఇప్పటికే చాలా ఎక్కువ ఇచ్చాం.. ఇంత కంటే ఎక్కువ ఇవ్వలేమంటోంది ప్రభుత్వం.. ముందు ఒప్పుకున్నారుగా.. మళ్లీ ఈ ఫిట్టింగ్‌ ఏంటని ఉద్యోగ సంఘాల నేతలను ప్రశ్నిస్తున్నారు. అయితే.. మీరు అన్ని లెక్కలు తేల్చలేదు.. మీరు తేలుస్తారులే అని మేం ఓకే చెప్పాం అంటున్నారు ఉద్యోగ సంఘాల నేతలు. దీంతో సమస్య పరిష్కారం అయినట్టే అయ్యింది.. మళ్లీ పీటముడి పడింది.


ఇక ఇప్పుడు ఉద్యోగ సంఘాల నేతలంతా ఐక్యం అవుతున్నారు.. ఇక తగ్గేదే..లే.. ఎందాకైనా పోరాడతాం అంటూ ఐక్య రాగం ఆలపిస్తున్నారు. ఇప్పుడు అన్ని ఉద్యోగ సంఘాలు ఒకే మాటపై ఉండటంతో ఉద్యోగులంతా ఐక్యంగా కనిపిస్తున్నారు. ఆ ఐక్యతతో కొందరు ఉద్యోగులు ప్రభుత్వ ఆదేశాలను సైతం ధిక్కరిస్తున్నారు. మేం ప్రకటించిన పీఆర్సీకే ఈ నెల లెక్కలు తేల్చండి.. జీతాలు రెడీ చేయండి అని ప్రభుత్వం ట్రెజరీ విభాగానికి ఆదేశాలు ఇచ్చినా.. దాన్ని అమలు చేసేది లేదంటున్నారు ట్రెజరీ ఉద్యోగులు.


ప్రభుత్వం సవరించిన వేతన బిల్లులను ప్రాసెస్ చేయాల్సింది ట్రెజరీ ఉద్యోగులే.. కానీ.. తాము ఈ జీతాలను ప్రాసెస్‌ చేసేది లేదంటున్నారు ట్రెజరీ ఉద్యోగులు.. కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు ప్రాసెస్ చేయాలని ఇప్పటికే సర్కులర్‌ జారీ అయినా దాన్ని ట్రెజరీ ఉద్యోగులు ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. డీడీవోలు, ట్రెజరీ ఉద్యోగులను ఆదేశిస్తూ సర్కులర్ జారీ అయినా పట్టించుకోవడం లేదు. పోనీ.. మా జీతాల వరకైనా ప్రాసెస్ చేయాలని ట్రెజరీ సిబ్బందికి అధికారుల సూచించినా పట్టించుకోవడం లేదు.


మేం జీతాలు ప్రాసెస్‌ చేయబోమని.. తమపై ఒత్తిడి తేవద్దని ట్రెజరీ ఉద్యోగులు అంటున్నారు. కొత్త పీఆర్సీ జీవోలు రద్దు చేయాలని ట్రెజరీ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ఏపీ ట్రెజరీ ఉద్యోగుల సంఘం ప్రకటన విడుదల చేసింది. మరి ఈ సమస్యను ప్రభుత్వం ఎలా పరిష్కరిస్తుందో..?


మరింత సమాచారం తెలుసుకోండి: