గోవాలో పట్టున్న కాంగ్రెస్ తో శివసేన ఎందుకు దూరం జరిగింది..?దీనికి దారి తీసిన పరిణామాలేంటి..? మహారాష్ట్ర లో మహావికాస్ అఘాడి తరహా సంకీర్ణ సర్కారును గోవాలో ఏర్పాటు చేయాలనుకున్న శివసేనకు ఆదిలోనే హంసపాదు ఎదురైందా..? కాంగ్రెస్ వైఖరే ఇందుకు కారణమా..? గోవా అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన ఎన్సీపీ కలిసి పోటీ చేయాలని నిర్ణయించాయి. ఈ మేరకు కూటమి ఏర్పాటుపై అధికారికంగా ప్రకటన చేశారు.

ఇరు పార్టీల నేతలు. మహారాష్ట్రలో అధికార మహా వికాస్ అఘాడిలో భాగమైన ఇరుపార్టీలు కాంగ్రెస్ లేకుండానే కూటమిగా ముందుకు వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. గోవా రాజధాని పనాజీలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో కూటమిపై ప్రకటన చేశారు. ఎన్సిపి నేతలు ప్రబుల్ పటేల్, జితేందర్ ఆహ్వాద్ కాంగ్రెస్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. తమతో జట్టు కట్టకపోవడం కాంగ్రెస్ దురదృష్టం, రానున్న గోవా అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన, ఎన్సీపీ కూటమి బలాన్ని చూపిస్తామని తమ పార్టీ మాత్రమే అధికారంలోకి వస్తుందని గోవా దివంగత ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ పెద్ద కుమారుడు ఉత్పల్ పారికర్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే మేము మద్దతిస్తామని స్పష్టం చేశారు. గోవాలో శివసేన 10 నుంచి 15 స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉంది. ఇరు పార్టీల నేతలు చర్చించి సీట్ల కేటాయింపుకు తుది రూపును ఇవ్వనున్నారుని ఆయా పార్టీల వర్గాలు తెలిపాయి. ఎన్నికల్లో పొత్తు విషయమై శివసేన, కాంగ్రెస్ మధ్య ఇప్పటికే  చర్చలు జరిగాయి. అయితే బిజెపి బలంగా ఉండే స్థానాలను శివసేనకు కాంగ్రెస్ ఆఫర్ చేసినట్లు సమాచారం.

 దీంతో శివసేన కాంగ్రెస్ తో పొత్తుకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. మహారాష్ట్రలో మహా వికాస అఘాడి తరహాలో గోవా సర్కారును ఏర్పాటు చేయాలంటే గెలిచేందుకు అవకాశం ఉన్న సీట్లను కేటాయించాలని శివసేన అడగ్గా అందుకు కాంగ్రెస్ నిరాకరించిదనే వాదన వినిపిస్తోంది. అందుకే శివసేన నేతలు కాంగ్రెస్ పట్ల బహిరంగంగానే తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రస్తుతం గోవా అసెంబ్లీలో బీజేపీకి సభ్యుల బలం 28 ఉంటే, కాంగ్రెస్ బలం 4 కి పడిపోయింది. గోవా ఎన్నికల్లో శివసేన, ఎన్సీపీ కూటమిగా పోటీ చేయడం సర్వత్రా  చర్చనీయాంశంగా మారింది. మరి వచ్చే ఎన్నికల్లో గెలుపు ఏ మేరకు ఈ కూటమి సాధిస్తుందో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: