తెలుగు రాష్ట్రాలు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాయి. తెలంగాణ పరిస్థితి కాస్త నయం.. కానీ ఏపీ పరిస్థితి మాత్రం దారుణంగా ఉందని చెబుతున్నారు. సంక్షేమ పథకాల భారమే ఈ ఆర్థిక ఇబ్బందులకు కారణం అని చెబుతుంటారు. అయితే.. ఇప్పుడు ఇలా ఆర్థిక సమస్యలతో ఇబ్బందుల్లో ఉన్న తెలుగు రాష్ట్రాలకు ఇప్పుడు మోడీ బంపర్‌ ఆఫర్ ఇచ్చేశారు. పన్నుల వాటాలో కేంద్రం రాష్ట్రాలకు డబుల్‌ ధమాకా ఇవ్వడంతో ఏపీకి రూ.3,847 కోట్లు, తెలంగాణకు రూ.1,998 కోట్లు నిధులు వచ్చాయి.


కేంద్రం తనకు వచ్చిన పన్నుల ఆదాయంలో రాష్ట్రాలకు కొంత వాటా ఇస్తుంటుంది. ఇది రాజ్యాంగ బద్దంగా రాష్ట్రాలకు దక్కే హక్కు. అయితే.. ఈసారి కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు నెలవారీగా చెల్లించే కేంద్ర పన్నుల్లోని వాటాను ఒకేసారి రెండు వాయిదాలు విడుదల చేసింది. ఈ మేరకు  కేంద్ర ఆర్థికశాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేయడం రాష్ట్రాలకు ఊరటనిచ్చింది. సాధారణంగా ఈ నెల వాయిదా కింద రాష్ట్రాలకు రూ.47,541 కోట్లు రావాల్సి ఉంది. అయితే.. ఈ మొత్తానికి కేంద్రం  ముందస్తుగానే మరో వాయిదాగా రూ.47,541 కోట్లు కలిపి ఇచ్చేసింది.


దీంతో మొత్తం కేంద్రం రూ.95,082 కోట్లు రాష్ట్రాలకు విడుదల చేసేసింది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. ఆంధ్రప్రదేశ్‌కు ఒక్కో వాయిదాకు రూ.1,923.98 కోట్ల చొప్పున రెండు వాయిదాల్లో రూ.3,847.96 కోట్లు ఒకేసారి వచ్చి చేరాయి. ఇక తెలంగాణ విషయానికి వస్తే.. రూ.999.31 కోట్ల చొప్పున రెండు విడతలూ కలిపి రూ.1,998.62 కోట్ల నిధులు వచ్చాయి. అసలే రాష్ట్రాలు కరోనా కారణంగా ఆదాయం లేక ఇబ్బందులు పడుతున్నాయని గుర్తించిన కేంద్రం ఒకనెల ముందుగానే ఓ వాయిదా సొమ్మును ముందుగానే ఇచ్చేసిందన్నమాట.


ఆర్థిక ఇబ్బందుల కారణంగా తమను ఆదుకోవాలని రాష్ట్రాలు అడగడంతో కేంద్రం గతంలోనూ ఓసారి ఇలా డబుల్‌ ధమాకా ఇచ్చింది. ఇప్పుడు కూడా మరోసారి కరోనా విజృంభించడంతో మళ్లీ అదే విధానం పాటించింది. అందువల్ల 2022 జనవరి నాటికి రాష్ట్రాలకు వాస్తవంగా విడుదల చేయాల్సిన పన్నుల వాటా కంటే రూ.90,082 కోట్లు అదనంగా ఇచ్చేసిందన్నమాట.


మరింత సమాచారం తెలుసుకోండి: