కరోనా చికిత్సలో స్టెరాయిడ్స్ ఉపయోగించవద్దని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు తాజాగా సవరించిన మార్గ దర్శకాలను ఐసీఎమ్ఆర్ విడుదల చేసింది. రోగికి స్టెరాయిడ్స్ అధిక మోతాదులో ఇవ్వడంతో బ్లాక్ ఫంగస్ లాంటి సెకండరీ ఇన్ ఫెక్షన్లు సోకే ప్రమాదముందని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. మరోవైపు కోవిడ్ సోకిన వారికి రెండు, మూడు వారాల కంటే ఎక్కువ కాలం దగ్గు ఉంటే టీబీ, ఇతర పరీక్షలు చేయాలని సూచించింది.

దేశంలో కరోనా విజృంభిస్తోన్న వేళ మరో షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. మళ్లీ బ్లాక్ ఫంగస్ కలకలం రేగింది. యూపీలో తొలి బ్లాక్ ఫంగస్ కేసు నమోదైంది. కంట్లో నొప్పిగా ఉందని వ్యక్తి రావడంతో టెస్టులు చేయగా.. కరోనా సోకినట్టు తేలిందని జీఎస్ వీఎమ్ మెడికల్ కాలేజీ డాక్టర్లు తెలిపారు. షుగర్ కారణంగా ఆ వ్యక్తికి బ్లాక్ ఫంగస్ సోకినట్టు తెలిపారు. బాధితుడిని ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

అనేక దేశాలు చేపట్టిన బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్ పై ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రధాన శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆరోగ్యంగా ఉన్నవారికి బూస్టర్ అవసరమని ఏ పరిశోధనలోనూ తేలలేదని వెల్లడించారు. తీవ్ర వ్యాధిగ్రస్తులు, వృద్ధులకు, రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్నవారికి మాత్రమే బూస్టర్ డోస్ ను ఉపయోగించాలని స్పష్టం చేశారు.

మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు పెరిగిపోతుండటంతో పలు దేశాలు ఆంక్షల బాటపడుతున్నాయి. ఈ క్రమంలోనే యూఏఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ దేశ రాజధాని అబుదాబిలోకి ఎవరైనా ప్రవేశించాలంటే బూస్టర్ డోస్ తప్పనిసరి చేసింది. రెండో డోసు వేసుకున్న వారు ఆరు నెలలకు బూస్టర్ డోస్ తీసుకుంటేనే వ్యాక్సినేషన్ పూర్తయినట్టు పరిగణిస్తామని ఆ దేశం ప్రకటించింది.

ఇదిలా ఉంటే కరోనా టీకా తీసుకున్న వారిలో రోగ నిరోధక శక్తిపై ఏఐజీ ఆస్పత్రి అధ్యయనం చేసింది. రెండు డోసుల టీకా వేసుకున్న 1636మందిపై పరిశీలన చేసింది. 30శాతం మందిలో 6నెలల తర్వాత రోగ నిరోధక శక్తి క్షీణిస్తోందని తేలింది. వారిలో అధికులు 40ఏళ్లు దాటిన దీర్ఘకాల వ్యాధుల బాధితులేనని వెల్లడైంది. వీరికి వెంటనే బూస్టర్ డోస్ ఇవ్వాలని ఏఐజీ ఛైర్మన్ నాగేశ్వర్ రెడ్డి సూచిస్తున్నారు.













మరింత సమాచారం తెలుసుకోండి: