ప్రకాశం జిల్లాలో కీలకమైన చీరాల నియోజకవర్గం పరిస్ధితి చూస్తే ఎవరికైనా ఇదే అనుమానం వస్తుంది. నియోజకవర్గంలో పార్టీకి మంచి క్యాడర్ ఉంది. కానీ ఆ క్యాడర్ ను ముందుండి నడిపించే లీడరే లేకుండా పోయారు. దాంతో నియోజకవర్గంలో టీడీపీ పరిస్ధితి అనాదగ మారిపోయింది. ఇంతకీ విషయం ఏమిటంటే మొన్నటి ఎన్నికల్లో చీరాల నుండి టీడీపీ తరపున కరణం బలరామ్ గెలిచారు. అయితే తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల కారణంగా కరణం పార్టీకి దూరమైపోయారు.




అధికార వైసీపీకి కరణం బాగా  సన్నిహితంగా మెలుగుతున్నారు. దాంతో ఆయనపై చంద్రబాబునాయుడు ఆశలు వదిలేసుకున్నారు. సమస్య ఏమిటంటే నియోజకవర్గంలో ముఖ్యనేతలంతా కరణంతో పాటు వైసీపీకి జై కొట్టారు. మరి ప్రత్యామ్నాయం ఏమిటి ?  ఇపుడా విషయమే పార్టీలో ఎంతకాలమైనా తెగటంలేదు. నియోజకవర్గానికి గట్టి నేతలేక రెండున్నర సంవత్సరాలైనా ఇంతవరకు చంద్రబాబు ఇక్కడ సరైన నేతలు ఇన్చార్జిగా నియమించలేకపోవటమే ఆశ్చర్యంగా ఉంది. ఒకళ్ళిద్దరు నేతలను అనుకున్నా ఎందుకనో మళ్ళీ వద్దనుకున్నారట.




నిజానికి చీరాలలో కాంగ్రెస్ కు మంచిపట్టుండేది. అయితే గెలిచింది తక్కువ సార్లే అయినా టీడీపీకి కూడా పట్టుందనే చెప్పాలి. ప్రత్యేకించి ఈ నియోజకవర్గంలో బీసీలతో పాటు ఎస్సీలదే ఆధిపత్యం. కరణం దూరమైన తర్వాత యడం బాలాజీని ఇన్చార్జిగా నియమించినా ఉపయోగం లేకపోయింది. ఎందుకంటే కొద్దిరోజులు యాక్టివ్ గానే ఉన్న బాలాజీ తరువాత కనబడటం మానేశారు. పార్టీ నాయకత్వం పిలుపు ప్రకారం ఇన్చార్జి లేకుండా క్యాడర్ మాత్రమే ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనల్లో పాల్గొంటోంది.




లీడర్ లేని క్యాడర్ డ్రైవర్ లేని వెహికల్ ఒకటే అన్న విషయం చంద్రబాబుకు తెలీదా ? దిశానిర్దేశం చేసే లీడర్ లేకపోవటంతో క్యాడర్ కూడా చెల్లాచెదురైపోతున్నారు. ఈ విషయం గమనించినా ఏమీ చేయలేని పరిస్ధితిలో నాయకత్వం ఉంది. నియోజకవర్గానికి యాదవ్ సామాజికవర్గానికి చెందిన నేతను ఇన్చార్జిగా చేస్తే ఎలాగుంటుందని అధిష్టానం చాలా కాలంగా ఆలోచిస్తునే ఉంది. ఇన్చార్జిగా నూకసాని బాలాజీ పేరు వినబడుతున్నా ఎందుకో ప్రకటించటంలేదు. బహుశా పాతకాపుల కోసం వెయిట్ చేస్తోందేమో. ఏదేమైనా చేతులారా నియోజకవర్గాన్ని టీడీపీనే చెడగొట్టుకుంటోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: